Warangal: అదనపు కట్నం కోసం భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త.. కాలు జారిపడినట్టుగా నమ్మించే యత్నం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపేశాడు. అదనపు కట్నం గురించి గొడవ పెట్టుకుని రోకలి బండతో కొట్టి హతమార్చాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మహిళను భర్త దారుణంగా హతమార్చాడు. అదనపు కట్నం తేవాలని భార్యను రోకలి బండతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కాలు జారిపడి మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, గ్రామస్తులు అసలు విషయం బయట పెట్టారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఓడిపిల్లవంచ గ్రామంలో చోటుచేసుకుంది.
సంధ్య, గణేశ్‌కు ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లల సంతానం. పాప, బాబు జన్మించారు. గారేపల్లి గ్రామానికి చెందిన సంధ్యను చిగురు గణేశ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే.. గత కొన్ని రోజులుగా సంధ్యను అదనపు కట్నం కోసం గణేశ్ వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం విషయమై భార్య, భర్తల మధ్య తరుచూ గొడవలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఓ గొడవే ఆదివారం రాత్రి జరిగింది. ఈ గొడవ జరుగుతుండగా ఆగ్రహంతో భర్త గణేశ్.. భార్య చిగురు సంధ్యను రోకలి బండతో కొట్టి చంపేశాడు. ఈ విషయం తెలియగానే.. ఈ రోజు ఉదయం కాటారం ఎస్సై స్పాట్‌కు చేరుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.