కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే ప్రారంభించనున్నారు. మోడీ సర్కార్ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజున కొత్త పార్లమెంట్‌ను ప్రారంభిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

భారత రాజకీయాలకు, భారతదేశ ప్రజాస్వామ్యానికి సౌధమైన పార్లమెంట్ కొత్గా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వినియోగిస్తున్న పార్లమెంట్ భవనం పాతది కావడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాని స్థానంలో కొత్తది నిర్మిస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ భవనం ఈ నెలలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మోడీ సర్కార్ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజున కొత్త పార్లమెంట్‌ను ప్రారంభిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఇకపోతే.. కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. మొత్తం నాలుగు అంతస్తుల ఈ భవనంలో 1,224 మంది ఎంపీలు ఏకకాలంలో కూర్చునేలా నిర్మించారు. అలాగే భోజన ప్రాంతాలు, విశాలమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్‌ పేరిట మూడు తలుపులను ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జీ 20 సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో.. జీ 20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం ఈ కొత్త భవనంలో జరిగే అవకాశం వుంది. 

ALso Read: కొత్త పార్లమెంట్ భవనంలో మోడీ చెకింగ్.. కార్మికులతో ములాఖత్ (ఫోటోలు)

మరోవైపు.. మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 51 ర్యాలీలు, 396 లోక్‌సభ స్థానాల్లోనూ బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు.