ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే జరిగే అవకాశం వుందన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. సాంకేతికత, భద్రత పరంగా చూస్తే పాత భవనంతో పోలిస్తే కొత్త భవనం ఎంతో ముందుంటుందని ఆయన అన్నారు. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో (parliament winter session 2022) జరిగే అవకాశం ఉందన్నారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (lok sabha speaker om birla) . కొత్త భవనంలో శీతాకాల సమావేశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, నూతన భవనం భారతదేశ స్వావలంబన చిత్రాన్ని స్పష్టంగా చూపుతుందని స్పీకర్ ఆకాంక్షించారు. సాంకేతికత, భద్రత పరంగా చూస్తే పాత భవనంతో పోలిస్తే కొత్త భవనం ఎంతో ముందుంటుందని ఆయన అన్నారు. అయితే, పార్లమెంటు భవనం కూడా కొత్త దాంట్లో భాగంగా ఉంటుందని ఓం బిర్లా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

పార్లమెంటులో ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. సభ్యులందరి సహకారంతో సభను రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. అన్ని పార్టీలు తమ నేతలతో మాట్లాడాలని .. తాను కూడా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి సభ సజావుగా సాగాలని, క్రమశిక్షణ, సభా మర్యాదలు పాటించాలని చెబుతూనే ఉంటానని ఓం బిర్లా స్పష్టం చేశారు.

Also Read:నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ప్రారంభం

కాగా.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్‌ పనులను ప్రారంభించింది. గత ఏడాదే ఈ ప్రాజెక్టు పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ. 971 కోట్లతో కొత్త భవనం రూపు దాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది. భూకంపాలకు సైతం చెక్కు చెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది. గుజరాత్‌ కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ఆకృతి (డిజైన్‌) ని రూపొందించగా, టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షం గాను, 9 వేల మంది పరోక్షం గాను పాలు పంచుకుంటున్నారు. 200 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.

లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మితం కానుంది. భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజన శాలలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.