దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ఇవాళ  ప్రారంభమయ్యాయి.14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి మూడ్రోజుల క్రితం ఆమోదం తెలిపింది. 

 కొత్త పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందిన టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్‌ పనులను ప్రారంభించింది.గత ఏడాదే ఈ ప్రాజెక్టు పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ. 971 కోట్లతో కొత్త భవనం రూపు దాల్చనుంది. ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది. ఎలాంటి భూకంపాలకు చెక్కు చెదరని రీతిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.

నూతన భవనం రూపు ప్రస్తుత భవనాన్ని పోలి ఉంటుంది. గ్రౌండ్‌, మొదటి, రెండు అంతస్తులుంటాయి. ఎత్తు కూడా ప్రస్తుత భవనం అంతే ఉంటుంది.గుజరాత్‌ కు చెందిన హెచ్‌సీపీ సంస్థ ఆకృతి (డిజైన్‌) ని రూపొందించగా, టాటా సంస్థ నిర్మాణం చేపడుతుంది. 

నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షం గాను, 9 వేల మంది పరోక్షం గాను పాలు పంచుకుంటారు. 200 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు ఇందులో పాల్గొంటారు.ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చోవడానికి అనుగుణంగా నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు.

లోక్‌సభ లో 888 మంది, రాజ్యసభ లో 384 మంది కూర్చునేందుకు వీలైన సామర్థ్యంతో కొత్త భవనం నిర్మితం కానుంది.భారత ప్రజాస్వామ్య వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజన శాలలు వంటివి ఏర్పాటు చేస్తారు.

2022 అక్టోబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.పార్లమెంటుకు కాస్త దూరంలో ఇప్పుడున్న శ్రమశక్తి భవన్‌ స్థానంలో ఎంపీల కోసం 2024 నాటి కల్లా 40 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ప్రత్యేక కార్యాలయాలు నిర్మించి ఇస్తారు. పార్లమెంటు, ఎంపీల కార్యాలయ భవనానికి మధ్య భూగర్భ మార్గం ఏర్పాటు చేస్తారు.