Asianet News TeluguAsianet News Telugu

రంగంలోకి దిగిన కాంగ్రెస్ కొత్త చీఫ్ ఖర్గే.. 47 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు.. శశి థరూర్ కు దక్కని చోటు

కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తన పని మొదలు పెట్టారు. పాత సీడబ్బ్యూసీని రద్దు చేశారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు తన టీమ్ తో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో శశిథరూర్ కు చోటు కల్పించలేదు. 

New Congress president Mallikarjun Kharge has formed a steering committee of 47 members. Shashi Tharoor did not get a place in this.
Author
First Published Oct 27, 2022, 8:51 AM IST

కొత్తగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. పాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. అయితే ఈ కొత్త ప్యానెల్‌లో ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రత్యర్థి శశి థరూర్‌కు చోటు దక్కకపోవడం విశేషం.అయితే ఎక్కువగా సీడబ్ల్యూసీలో పనిచేసిన కాంగ్రెస్ నేతలకు ఇందులో స్థానం కల్పించారు. 

అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. పార్టీ ప్లీనరీలో ఖర్గే ఎన్నికను ఆమోదించేంత వరకు, కొత్త సీడబ్ల్యూసీ ఏర్పడే వరకు ఖర్గే నేతృత్వంలోని మధ్యంతర ప్యానెల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో ఉంటుంది. ఈ కొత్త ప్యానెల్ ఏర్పాటు చేసే ముందు కొత్త పార్టీ చీఫ్ తన సొంత టీమ్ ను ఎంచుకోవడానికి వీలుగా పార్టీలోని అన్నిసీడబ్ల్యూసీ సభ్యులు, ఆఫీస్ బేరర్లు తమ రాజీనామాలను సమర్పించారు.

మన దేశంలో 22 కోట్ల మంది చిన్నారులపై పేదరికం,విపత్తుల ప్రభావం

ఈ స్టీరింగ్ కమిటీలో ప్రియాంక గాంధీ వాద్రా, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. వివేక్ బన్సాల్ మినహా.. మునుపటి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులందరినీ కమిటీలో ఉంచారు. గతంలో సీడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బన్సాల్ ఇప్పుడు హర్యానా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

కొత్త కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా అజయ్ కుమార్ లల్లూ, చింతా మోహన్, దీపేందర్ సింగ్ హుడా, సచిన్ రావు, సేవాదళ్ ప్రధాన నిర్వాహకుడు లాల్జీ దేశాయ్, ఐవైసీ చీఫ్ శ్రీనివాస్, ఎన్ఎస్ యూఐ చీఫ్ నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ చీఫ్ నెట్టా.డి. సౌజా, ఐఎన్ టీయూసీ అధ్యక్షుడు జి సంజీవ రెడ్డిలు ఉన్నారు. కాగా.. గత కమిటీలో సభ్యుడు, పార్టీలో సంస్థాగత మార్పు కోసం ప్రయత్నిస్తున్న జీ 23 అసమ్మతి గ్రూపులో ప్రముఖ నాయకుడు ఆనంద్ శర్మను స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించారు. కాగా..కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న వెంటనే కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు అందరూ రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది. 

"నేను మీ కొడుకుగా గర్వపడుతున్నాను" భావోద్వేగానికి లోనైన రాహుల్

ఇదిలా ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే మూడు సమావేశాలు నిర్వహించింది. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నుండి కూడా కాంగ్రెస్ గట్టి సవాలును ఎదుర్కొంటోంది. 1998 నుంచి గుజరాత్‌లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. అయితే ఏడాదిలోపు గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 

ఏమిటీ సీడబ్ల్యూసీ ? 
సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఇందులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు అందరూ ఉంటారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. సీడబ్ల్యూసీకి 11 మంది సభ్యులు నామినేట్ అవుతారు. 12 మందిని ఎన్నుకుంటారు. దీంతో పాటు పార్లమెంట్‌లోని పార్టీ నేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. అయితే కొత్త కమిటీ ఎన్నికయ్యేంత వరకు స్టీరింగ్ కమిటీ అన్ని నిర్ణయాలను తీసుకుంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios