బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు కూడా కొత్త విద్యా విధానాన్ని అంగీకరించాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నూతన విద్యా విధానం అమలు విషయంలో కొన్ని రాష్ట్రాల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి..
బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు కూడా కొత్త విద్యా విధానాన్ని అంగీకరించాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా కొత్త విద్యా విధానాన్ని అంగీకరించాయని ఆయన అన్నారు.
డీఎంకే ఎంపీ తమిళచి తంగా పాండియన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయం చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ సమాధానానికి నిరసనగా డీఎంకే ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
బడ్జెట్ పై చర్చ కోసం పార్లమెంట్ లోక్ సభ సోమవారం మళ్లీ సమావేశమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే ఎంపీ తమిళచి తంగా పాండియన్ మాట్లాడుతూ, పీఎం శ్రీ పథకం కింద తమిళనాడుకు ఇవ్వాల్సిన 2152 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయలేదని, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన విద్యా నిధులు తమిళనాడుకు ఇవ్వలేనిమంత్రి ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం విధానాన్ని అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు నిరాకరించమని, నిధుల తిరస్కరణను రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించే సాధనంగా ఉపయోగించమని హామీ ఇస్తారా అని పార్లమెంట్ వేదికగా తమిళచి తంగా పాండియన్ ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, "మార్చి నెల ముగియడానికి ఇంకా 20 రోజులు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టంగా ఉంది. తమిళనాడు ప్రభుత్వంతో చాలాసార్లు చర్చలు జరిపాము. పీఎం శ్రీ పాఠశాలలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదరాల్సి ఉంది. దానికోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కనిమొళి, తమిళచి తంగా పాండియన్ సహా తమిళనాడు ఎంపీలు నన్ను కలిశారు. కానీ వారు చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు" అని అన్నారు.
డీఎంకే ఎంపీల ఆందోళనల మధ్య మంత్రి మాట్లాడుతూ, "బీజేపీ పాలించని రాష్ట్రాల్లో కూడా, ఉదాహరణకు కర్ణాటకలో కూడా జాతీయ విద్యా విధానాన్ని అంగీకరించారు. కాంగ్రెస్ పాలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొత్త విద్యా విధానం అమలు చేశారు. జాతీయ విద్యా విధానం ద్వారా హిందీ రుద్దబడుతోందని ఆరోపించడం తప్పు" అన్నారు.
డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేసిన ధర్మేంద్ర ప్రదాన్.. " తమిళ విద్యార్థుల గురించి అక్కడి ప్రభుత్వానికి పట్టింపు లేదు. వాళ్లు తమిళ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వాళ్ల పని భాష సమస్యను సృష్టించడం మాత్రమే. వాళ్లు రాజకీయం చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. వాళ్లు ప్రజాస్వామ్య వ్యతిరేకులు, సభ్యత లేనివాళ్లు' అని విమర్శించారు.
"పీఎం శ్రీ పథకంలో చేరుతున్నామని చెప్పి, తర్వాత యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు? తమిళనాడు ముఖ్యమంత్రి కొత్త విద్యా విధానాన్ని అంగీకరించి సంతకం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఉన్నట్టుండి ఒక సూపర్ ముఖ్యమంత్రి వచ్చి దాన్ని ఆపేశారు. తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తోంది. సూపర్ ముఖ్యమంత్రి చెప్పడం వల్ల కొత్త విద్యా విధానంపై సంతకం చేయడానికి నిరాకరించింది. ఆ సూపర్ ముఖ్యమంత్రి ఎవరు?" అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యల్లో 'సభ్యత లేనివాళ్లు, ప్రజాస్వామ్య వ్యతిరేకులు' అని మాట్లాడినందుకు డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు. దీంతో తన మాటల్లో ఆ పదాలు బాధించే విధంగా ఉంటే, వాటిని వెనక్కి తీసుకుంటానని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
