సీఎం సిద్ధరామయ్యను నిలదీసిన ఎదురింటి వ్యక్తి.. ‘ఏంటీ ఈ న్యూసెన్స్.. నా ఇంటి ముందే పార్క్ చేస్తున్నారు’
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఎదురింటి వ్యక్తి నిలదీశారు. సీఎం కోసం వచ్చిన అతిథులు తన ఇంటి ముందు వాహనాలు పార్క్ చేస్తున్నారని, తమ వాహనాన్ని బయటకు తీసే అవకాశం లేకుండా పోతున్నదని అన్నారు. గత ఐదేళ్లుగా ఈ సమస్య ఎదుర్కొంటున్నామని సీఎం సిద్ధరామయ్య కారును అడ్డుకుని అడిగాడు.
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇంటికి ఎదురుగా ఉండే ఓ వ్యక్తి ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నాడు. ఏంటీ ఈ న్యూసెన్స్ అంటూ నిలదీశాడు. ఆయన ఇంటికి వచ్చే అతిథులందరూ వారి వాహనాలను ఎక్కడపడితే అక్కడ, తన ఇంటి ముందూ పార్క్ చేస్తున్నారని తెలిపాడు. తనకు, తన కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉన్నదని వివరించాడు. తమ వెహికిల్స్ ఇంటి నుంచి బయటకు తీసే అవకాశమే ఉండటటం లేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది.
సీఎం సిద్ధరామయ్య ఇంకా అధికారిక నివాసానికి మారలేదు. ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడికి కేటాయించే ఇంటిలోనే ఉంటున్నారు. ఆయన ఇంటికి ఎదురుగా నరోత్తమ్ అనే పెద్దాయన కుటుంబం నివసిస్తున్నది. సిద్ధరామయ్య ఇంటికి వచ్చే వారు వారి వాహనాలను నరోత్తమ్ ఇంటి ముందు పార్క్ చేస్తున్నారని, అది వారికి ఇబ్బందిగా మారిందని నరోత్తమ్ చెప్పాడు. సీఎం సిద్ధరామయ్య ఇంటి నుంచి బయటకు తన కాన్వాయ్‌లో వెళ్లుతుండగా నరోత్తమ్ అడ్డు వచ్చాడు. సీఎం సిద్ధరామయ్య కారును ఆపి ఈ విషయాన్ని చెప్పాడు.
గత ఐదేళ్ల నుంచి తాము ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, తమ సహనం నశించిపోయిందని, ఇక మరెంత కాలమూ తాము ఈ సమస్యను అంగీకరించబోమని నరోత్తమ్ తెగేసి చెప్పేశారు. నరోత్తమ్ డిమాండ్లకు సీఎం సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారు.
Also Read: Bro: థియేటర్‌లో పాలాభిషేకంతో స్క్రీన్ పై పాలు.. చిరిగిపోయిన స్క్రీన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరెస్టు
తన ఇంటి వద్ద ఉండే భద్రత సిబ్బందిని ఉద్దేశిస్తూ ఈ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. నరోత్తమ్ ఇలా సమస్యను ఎదుర్కోకుండా చూడాలని చెప్పారు.
సీఎం సిద్ధరామయ్య ఇంకా సీఎం అధికారిక బంగ్లాకు మారలేదు. మొన్నటి దాకా సీఎం అధికారిక భవనంలో మాజీ సీఎం యెడియూరప్పనే ఉన్నారు. సిద్ధరామయ్య త్వరలోనే బహుశా ఆగస్టులో సీఎం అధికారిక బంగ్లాలోకి మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో నరోత్తమ్ కు కూడా కొంత ఉపశమనం తప్పక లభించే అవకాశం ఉన్నది.