coronavirus: దేశంలో భారీగా పెరిగిన కరోనా కొత్త కేసులు..
coronavirus: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి అధికం కావడంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు భారీగా పెరిగాయి. 33 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది.
coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదలతో పాటు.. సాధారణ కరోనా కేసులు సైతం అధికం అవుతున్నాయి. దేశంలో కొత్తగా కరోనా కేసులు భారీగా వెలుగుచూశాయి. 33 వేలకు పైగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ ప్రస్తుత వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 33,750 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా మహమ్మారి బారినపడ్డవారి సంఖ్య 3,49,22,882 కు చేరింది. నిన్నటితో పోలిస్తే.. 22 శాతం కొత్త కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 1,45,582 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా 10,846 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407కు పెరిగింది.
Also Read: sex abuse case: సెక్స్ కుంభకోణంలో ట్రంప్, క్లింటన్.. మరోసారి తెరపైకి జెఫ్రీ ఎప్‌స్టీన్
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ.. 123 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాలు 4,81,893కు పెరిగాయి. అత్యధిక కరోనా మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. దేశంలో వారంలో (డిసెంబర్ 27-జనవరి 2) దాదాపు 1.3 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది 12 వారాల గరిష్టం. ఇక కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ బారినపడుతున్న వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది కోలుకున్నారు. దేశంలోని ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్ 136, తమిళనాడు 121, రాజస్థాన్ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నమోదయ్యాయి.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాయి. దీనిలో భాగంగా దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 సంత్సరాల లోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు. కో-విన్ ప్లాట్‌ఫారమ్‌లో ఆదివారం రాత్రి 9 గంటల వరకు 15-18 ఏళ్ల మధ్య వయస్సు గ్రూపు వారు 6.79 లక్షల మంది పిల్లలు కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏజ్ గ్రూప్ వారికి నేటి నుంచి (సోమవారం) వ్యాక్సిన్లను అందించనున్నారు. వీరికి హైదరాబాద్ కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్.. ఐసీఎంఆర్, ఫూణే వైరాలజీల సహాయంతో తయారు చేసిన కరోనా టీకా కోవాగ్జిన్ ఇవ్వనున్నారు. దీనిని 28 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల్లో అందించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్న కేంద్రాల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసం 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సిన్‌లను.. ఇప్పటికే ఇస్తున్న ఏజ్ గ్రూప్ వారి టీకాలతో కలపకుండా ఉండేందుకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టీకా బృందాలను రంగంలోకి దించుతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం జారీ చేసింది.
Also Read: Assembly Elections2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి .. లేకుంటే..?