నాగాల్యాండ్‌లో బీజేపీ, ఎన్‌డీపీపీ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఇస్తున్నట్టు  శరద్ పవార్ వెల్లడించారు. ఎన్నికలకు ముందే అక్కడ రియోతో ఎన్సీపికి అవగాహన ఉన్నదని తెలిపారు. అందుకే తమ పార్టీ రియో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నదని వివరించారు. అదే సమయంలో బీజేపీకి ఎన్సీపీ మద్దతు అనే విషయంపైనా ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన మధ్య తలెత్తిన వైరుధ్యాలను ఆసరాగా తీసుకుని అధికారంలోకి వచ్చేసింది. దేశ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసేలా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీని పక్కకు నెట్టి కాంగ్రెస్‌ను, శివసేనను ఏకతాటి మీదికి తెచ్చింది. అప్పటి నుంచి బీజేపీకి ఎన్సీపీ దూరంగా ఉంటున్నది. అయితే, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. నాగాల్యాండ్‌లో అధికార కూటమి ఎన్‌డీపీపీ, బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో దుమారం రేపుతున్నది.

నాగాల్యాండ్‌లోని నీఫియు రియో సారథ్యంలోని ఎన్‌డీపీపీ, బీజేపీ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఇస్తుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం వెల్లడించారు. ఎన్నికలకు ముందే రియోతో తమకు ఒక అవగాహన ఉన్నదని వివరించారు. 

60 అసెంబ్లీ స్థానాలు గల నాగాల్యాండ్‌లో ఎన్సీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఎన్‌డీపీపీ, బీజేపీ బలం 37(ఎన్‌డీపీపీకి 25, బీజేపీకి 12 సీట్లు). ఎన్నికల్లో ఎన్‌డీపీపీ, బీజేపీ కలిసే పోటీ చేశాయి.

‘నాగాల్యాండ్ ఎన్నికలకు ముందే రియోతో తమకు ఒక అవగాహన ఉన్నది. ఎన్సీపీ ప్రభుత్వంలో చేరాలా? లేక ప్రతిపక్షంలో కూర్చోవాలా అనే అంశంపై సుదీర్ఘంగా ఎన్సీపీ చర్చించింది. నాగాల్యాండ్ విస్తృత ప్రయోజనాల కోసం అధికార పక్షంతో చేతులు కలపాలనే ఎన్సీపీ నిర్ణయం తీసుకుంది’ అని శరద్ పవార్ తెలిపారు.

కొత్తగా ఎన్నికైన ఎన్సీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రభుత్వంతో చేతులు కలపాలనే భావించారని, కానీ, తుది నిర్ణయాన్ని పార్టీ అధినేత శరద్ పవార్‌కే విడిచిపెట్టారని ఎన్సీపీ ప్రతినిధి నరేంద్ర వర్మ తెలిపారు.

Also Read: రోడ్డు మీద ట్రక్కు ఆపి...చెరకు గడులు లాగేసిన ఏనుగు... వైరల్ వీడియో..!

అయితే, బీజేపీకి మద్దతు ఇవ్వడంపై శరద్ పవార్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. నాగాల్యాండ్ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతును, బీజేపీకి సపోర్ట్‌గా చూడరాదని అన్నారు. అది కచ్చితంగా తప్పే అవుతుందని వివరించారు. తాము రియోతో చేతులు కలిపామని, బీజేపీతో కాదని తెలిపారు. 

ముంబయిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా బీజేపీపైనా విమర్శలు చేశారు. మేఘాలయా అసెంబ్లీ ఎన్నికలను ఆయన ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఆరోపణలు చేశారు. మేఘాలయా ఎన్నికల్లో అక్కడి నేతలపై అవినీతి ఆరోపణలు బలంగా చేసిన బీజేపీ.. ఫలితాలు వెలువడ్డాక ఆ నేతలతోనే చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు. అంతేకాదు, ఆ సీఎం (కొన్రాడ్ సంగ్మా) ప్రమాణానికి ప్రధాని మోడీ హాజరయ్యారని విమర్శించారు.