మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ప్రభుత్వంలోనూ కీ రోల్ దక్కింది. ఆయన పార్టీకి చెందిన మంత్రులకు కీలక శాఖలను అప్పగించేందుకు సీఎం ఉద్దవ్ థాక్రే సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.

డిసెంబర్ 30న జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఉద్ధవ్ తన కేబినెట్‌లోకి చేర్చుకున్నారు. ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కి 10, శివసేనకు 12 మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరికీ ఏ శాఖను ఇవ్వాలనే దానిపై ముఖ్యమంత్రి సుదీర్ఘ కసరత్తు చేశారు.

Also Read:మహిళ శవాన్ని .. భుజాలపైనే ఐదుకిలోమీటర్లు మోసిన ఫ్యామిలీ

డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కీలకమైన ఆర్ధిక శాఖ, ఉద్థవ్ కుమారుడు ఆదిత్య థాక్రేకు పర్యావరణ, పర్యాటక శాఖ ఇస్తారని సమాచారం. అతి ముఖ్యమైన హోంశాఖను ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్‌ముఖ్‌కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అలాగే ఏక్‌నాథ్ షిండేకు పట్టణాభివృద్ధి శాఖ, శుభాష్ దేశాయ్‌కు పరిశ్రమలు, బాలాసాహెబ్ తోరట్‌కు రెవెన్యూ, కార్మికశాఖలు.. దిలీప్ వాల్సే పాటిల్‌కు ఆరోగ్యం, వర్షా గైక్వాడ్‌కు సామాజిక న్యాయ శాఖ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:సొంత ఇలాఖాలో అమిత్ షాకు ఎదురు దెబ్బ: అత్తగారి ఊరిలో బీజేపీ స్మాష్

శాఖల కేటాయింపుపై ఇప్పటికే శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేల మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాఖల కేటాయింపులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రణతి షిండే ఇప్పటికే ఆందోళనకు దిగారు.