ఎన్‌సీఈఆర్‌టీ సంచలన నిర్ణయం.. కొత్త పుస్తకాల్లో ఆ పదం తొలగింపు..
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠ్య పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరుకు బదులు భారత్ అనే పేరును వాడాలని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా విపరీతమైన ఊహాగానాలు వెలువడుతున్న ఇండియా(INDIA) పేరును భారత్ గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పేరును వాడాలని, ఈ ప్రతిపాదనను వెంటనే అమలులోకి తీసుకరావాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
రాజ్యాంగం ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించబడిన విషయం తెలిసిందే.
ఎన్సీఈఆర్టీ ప్యానెల్ ఆమోదించడంతో ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు కనుమరుగు కానున్నది. ఈ సందర్భంగా ప్యానెల్ ఛైర్మన్ ఐజాక్ మాట్లాడుతూ..ఎన్సీఈఆర్టీ కొత్త పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, ఇప్పుడు ఆ ప్రతిపాదనకు ప్యానెల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా ముద్రించే ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
హిందూ విజయాలపై ఫోకస్..
మరోవైపు.. ఇండియా పదాన్ని తొలగించడమే కాకుండా.. గతంలో జరిగిన వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను కూడా ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఐజాక్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చరిత్రలో ఇప్పటివరకు హిందువుల ఓటముల ప్రస్తావనే ఉందని, కానీ మొఘలుల మీద, సుల్తానుల మీద హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కడ కూడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
కొత్త పుస్తకాల్లో ఓల్డ్ హిస్టరీకి బదులు.. క్లాసికల్ చరిత్ర ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారుసు చేసిందని తెలిపారు. భారత దేశ శాస్త్రీయ పురోగతి, జ్ఞానం గురించి తెలియకుండా భారత్ ను అంధకారంలో చూపించిన బ్రిటిష్ చరిత్రను ఇకపై ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రగా విభజించనున్నట్టు ఐజాక్ వివరించారు. అన్ని పాఠ్యాంశాల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్) ను ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు చెప్పారు.
వాస్తవానికి ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అనే పేరు పెట్టుకున్న నాటి నుంచి.. కేంద్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాల్లో ఇండియా అనే పేరు వాడట్లేదు. జీ 20 సదస్సు నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.
అలాగే.. సెప్టెంబర్ లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరిగిన జీ 20 లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని మోడీ తన నేమ్ ఫ్లేట్ పై కూడా భారత్ ముద్రించడం చర్చనీయంగా మారింది. ఇలా చాలా కార్యాక్రమంలో పేరు మార్పు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అయితే.. తాజా ఘటన అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటములకు మరో రాజకీయ అస్త్రం మారింది. ఈ విషయంపై బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్నాయి.