కరోనా కల్లోల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా టీకా పంపిణీ బృహత్ కార్యం దేశంలో 34 లక్షలకు పైగా మందిని కాపాడిందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ రిపోర్ట్ తెలిపింది. ఈ నిర్ణయం కేవలం లక్షలాది మంది ప్రాణాలను కాపాడటమే కాదు.. ఆర్థికంగానూ రూ. 18.3 బిలియన్ అమెరికా డాలర్ల నష్టాన్ని నివారించగలిగిందని వివరించింది. ఈ రిపోర్టును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా విడుదల చేశారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారుమబ్బులా కమ్మేసిన కాలంలో సంజీవనిగా అందివచ్చిన టీకాలను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఎవరూ ఊహించని పెద్ద స్థాయిలో పంపిణీ చేయడానికి నిర్ణయించింది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ టీకా పంపిణీ కార్యక్రమం 34 లక్షల మందికి పైగా భారతీయుల ప్రాణాలను కాపాడిందని తాజాగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నివేదిక ఒకటి వెల్లడించింది. కేవలం ప్రాణాలు కాపాడటమే కాదు.. అది ఆర్థికంగానూ సానుకూల ప్రయోజనాలను కలిగించిందని వివరించింది. 18.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఈ టీకా పంపిణీ కార్యక్రమం అడ్డుకున్నదని తెలిపింది.
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్‌నెస్ సంయుక్తంగా రూపొందించిన ఈ రిపోర్టు (హీలింగ్ ది ఎకానమీ: ఎస్టిమేటింగ్ ది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాస్ వ్యాక్సినేషన్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్)ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ 19ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌వో 2020 జనవరిలో ప్రకటించడానికి ముందుగానే భారత ప్రభుత్వం కట్టడి చర్యలకు సిద్ధమైందని అన్నారు.
ముందుగా లాక్‌డౌన్ విధించడం ద్వారా టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ ప్రోటోకాల్ పాటించడం అనే ఐదు సూత్రాలను సొసైటీ పాటించడానికి, ప్రభుత్వం అమలు చేయడానికి సులువైందని ఆయన తెలిపారు. అలాగే, కరోనాను ఎదుర్కోవడానికి వేగంగా చర్యలు తీసుకోవడం, నిర్ణయాలు అమలు చేయడం సరళతరమైందని వివరించారు. ముఖ్యంగా కరోనా పేషెంట్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, బెడ్లు, మందులు, రవాణాపరమైన అవసరాలు, ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లు, మెడికల్ ఆక్సిజన్‌లను సమకూర్చడం, అదే కాలంలో మానవ వనరులను అభివృద్ధి చేసుకోవడాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా సకాలంలో చేపట్టిందని చెప్పారు.
Also Read: కరోనాకు భయపడి మూడేళ్లుగా ఇంట్లోనే వివాహిత.. భర్తను కూడా రానివ్వలేదు.. తలుపులు పగులగొట్టిన అధికారులు
ఇవన్నీ ఒక వైపు చేసుకుంటూనే మరో వైపు దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి పూనుకుందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ఇదేనని అన్నారు. 97 శాతం మందికి తొలి డోసు, 90 శాతం మందికి రెండో డోసు ఇవ్వగలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంతో మొత్తంగా అర్హులకు 2.2 బిలియన్ల డోసులను అందించిందని వివరించారు. ఆరోగ్య సేతు, కొవిడ్ 19 ఇండియా పోర్టల్, ఈ సంజీవని టెలీ మెడిసిన్ సర్వీస్ వంటి డిజిటల్ సొల్యూషన్స్ తెచ్చామని గుర్తు చేశారు.
స్టాన్‌ఫోర్డ్ నివేదిక కూడా కరోనా కట్టడికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను విశ్లేషించింది. పై నుంచి క్షేత్రస్థాయికి కాకుండా.. కింది నుంచే పైకి అనే విధానంలో కట్టడి చర్యలు తీసుకున్నారని తెలిపింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్, మాస్ టెస్టింగ్, హోం క్వారంటైన్, అత్యవసర మెడికల్ ఎక్విప్‌మెంట్‌ల పంపిణీ, ఎప్పటికప్పుడు హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రివ్యాంప్ చేసుకుంటూ.. కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో వీటిపై సమన్వయం కలిగి ఉండటం వంటి వివరాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ నిర్ణయాలు కరోనా కట్టడిలో దోహదపడ్డాయని వివరించింది.
భారత కొవిడ్ స్ట్రాటజీలో మూడు ప్రధానాంగాలుగా ఉన్నాయని, అవి కట్టడి, రిలీఫ్ ప్యాకేజీ, టీకా పంపిణీ అని వివరించింది. ఈ మూడు చర్యలతో ప్రాణాలు కాపాడటమే కాదు.. ఆర్థిక వ్యవహారాలను కొనసాగిస్తూ.. వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పొందడానికి వీలు కల్పించిందని రిపోర్ట్ తెలిపింది. తద్వార టీకా పంపిణీ కార్యక్రమంతో 34 లక్షల మంది ప్రాణాలను భారత ప్రభుత్వం కాపాడిందని వివరించింది. టీకా పంపిణీ కార్యక్రమం కేవలం ప్రాణాలనే కాదు.. ఆర్థిక కార్యకలాపాలనూ సజీవంగా ఉంచిందని తెలిపింది. 18.3 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టాన్ని నివారించిందని, ఇందులో టీకా పంపిణీ కార్యక్రమం ఖర్చు తీసేసినా నికరంగా 15.42 బిలియన్ అమెరికన్ డాలర్ల నష్టాన్ని అడ్డుకుందని వివరించింది.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల అభివృద్ధితో వైరస్ పై గట్టి దాడి చేసిందని, పెద్ద మొత్తంలో ప్రజలకు టీకా డోసులను పంపిణీ చేయడమే కాదు.. ఆరోగ్య వ్యవస్థపై భారాన్ని గణనీయంగా తగ్గించిందని రిపోర్ట్ తెలిపింది.
