గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళ కరోనాకు భయపడి మూడేళ్లుగా ఇంటికే పరిమితమై ఉన్నది. బయటకు వెళ్లిన భర్తను కూడా ఇంటిలోకి రానివ్వలేదు. మూడేళ్లుగా బయటి ప్రపంచం చూడలేదు. దీంతో భర్త కూడా సమీపంలోనే మరో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మూడేళ్ల తర్వాత కూడా బయట ప్రపంచం సాధారణ పరిస్థితులకు వచ్చినప్పటికీ ఆమె బయటకు రాలేదు. దీంతో భర్త పోలీసులను ఆశ్రయించాడు. వారు ఆ డోర్లు పగులగొట్టి వారిని రక్షించారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తొలిసారి మన దేశంలోకి ఎంటర్ అయినప్పుడు అంతటా భయాందోళనలు అలుముకుని ఉన్నాయి. ఎటు చూసినా భయాలు, అనుమానాలే.. మరికొన్ని చోట్ల నిరాశ, నిస్పృహలు.. టీవీ ఆన్ చేసి వార్తలు చూడాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. అదిగో అప్పుడే.. ఆ కాలంలోనే ఓ మహిళ తన ప్రాణాల కోసం, తన కొడుకు ప్రాణాల కోసం తీవ్ర నిర్ణయం తీసుకుంది. బయటి ప్రపంచంతో సంబంధాలనే తెంచేసుకుంది. ఇంటికి తాళం వేసింది. లోపలే ఉండిపోయింది. మూడేళ్లుగా బయటి ప్రపంచం చూడకుండా.. సూర్యుడి వెలుతురూ తగలకుండా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఫస్ట్ లాక్‌డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినప్పుడు భర్త ఆఫీసు కోసం వెళ్లగా.. మళ్లీ ఇంటిలోకి రానివ్వలేదు. దీంతో గత్యంతరం లేక అదే ఏరియాలో మరో చోట గదిని అద్దెకు తీసుకుని భార్య, కొడుకును చూడటానికి పడిగాపులు కాశాడు. కేవలం వీడియోకాల్ ద్వారా మాత్రమే వారితో టచ్‌లో ఉండాల్సి వచ్చింది. ఇదంతా గురుగ్రామ్‌లో ఓ వివాహితకు సంబంధించిన కథనం.
33 ఏళ్ల మున్మున్ మాఝి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్లుగా అద్దె ఇంటిలో నుంచి బయటకు వెళ్లకుండా కరోనాకు భయపడి లోపలే ఉండిపోయారు. ఈ విషయం ఫిబ్రవరి 17వ తేదీన వెలుగులోకి వచ్చింది. ఆమె భర్త సుజన్ మాఝి చక్కర్‌పూర్ పోలీసు పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌ను కలిసి ఈ విషయం చెప్పాడు. కానీ, ఎస్ఐ నమ్మలేకపోయాడు. దీంతో తన భార్యకు సుజన్ వీడియో కాల్ చేసి ఏఎస్ఐ ముందు మాట్లాడాడు. అప్పుడు అతను కలుగజేసుకున్నారు.
ఈ మూడేళ్లు భర్తనే ఆ ఇంటి అద్దె, ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్ సరుకులు, కూరగాయలు అన్నీ అందించేవాడు. సుజన్ ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్. తన భార్య తీరుతో తీవ్ర వేధనకు గురయ్యాడు. ఏఎస్ఐని సంప్రదించిన తర్వాత పోలీసు బృందం, హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు, శిశు సంరక్షణ శాఖ అధికారులు కలిసి ఆ ఇంటికి వెళ్లారు. డోర్ పగులగొట్టారు. మున్మున్ మాఝిని, వారి పదేళ్ల కొడుకును రెస్క్యూ చేశారు. వారిద్దరినీ గురుగ్రామ్‌లోని సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: నేటీకీ ఆ విషయం అంతర్జాతీయంగా ఆందోళన కలిగించేదే: WHO
ఆ మహిళకు కొన్ని సైకలాజికల్‌గా సమస్యలు ఉన్నాయని, వారిద్దరినీ రోహతక్‌లోని పీజీఐకి రిఫర్ చేసినట్టు గురుగ్రామ్ సివిల్ సర్జన్ డాక్టర్ వీరేందర్ యాదవ్ తెలిపారు. అక్కడ సైకియాటర్ిక్ వార్డ్‌లో చికిత్స కోసం అడ్మిట్ చేసుకున్నారని వివరించారు.
ఆ మహిళ, పిల్లాడు ఉన్న గది దుర్భరంగా మారిపోయిందని, చెత్తా చెదారంతో దారుణంగా ఉన్నదని ఏఎస్ఐ కుమార్ పీటీఐకి వివరించారు. మరికొన్నాళ్లు వారు అలాగే ఉంటే.. జరగరానిది జరిగి ఉండేదని అన్నారు. ఈ మూడేళ్లు ఆ మహిళ కుకింగ్ గ్యాస్, స్టోరేజీ వాటర్ కూడా యూజ్ చేయలేదని, కొవిడ్ భయం మూలంగానే వీటిని వినియోగించలేదని తెలిపారు.
ఇప్పుడు భర్త సుజన్ ఆనందంగా ఉన్నాడు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇప్పుడు వారికి చికిత్స అందిస్తున్నారు. నా జీవితం మళ్లీ గాడిన పడుతుందని భావిస్తున్నాను’ అని వివరించాడు.
