మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సహా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు ఎస్పీజీ భద్రతను తొలగించింది. దీనికి బదులుగా జడ్‌ప్లస్ క్యాటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఎస్పీజీ చట్టాన్ని సవరించేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీ కలిగివున్న వ్యక్తిగా నిలవనున్నారు.

1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని సొంత అంగరక్షకులే కాల్చి చంపడంతో.. 1985లో నాటి రాజీవ్ సర్కార్ ఎస్పీజీని ఏర్పాటు చేసింది. 1991లో రాజీవ్ గాంధీ దారుణహత్య జరిగిన నాటి నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ స్థాయి భద్రతను కల్పిస్తున్నారు.

Also Read:మౌనమునికి మోడీ షాక్: మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ

ఈ ప్రత్యేక దళంలో సుశిక్షితులైన 3 వేలమంది దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబసభ్యులకు రక్షణ కల్పిస్తారు. మనదేశంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకలకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉంది. ఎస్పీజీ భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి.. అవసరం లేనప్పుడు ఆ భద్రతను తొలగిస్తుంది.

ప్రస్తుతానికి గాంధీ ఫ్యామిలీకి ఎలాంటి ముప్పు లేదని నిఘా వర్గాల ఇచ్చిన నివేదిక ప్రకారం ఎస్పీజీ భద్రతను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా గత ఆగస్టు నెలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా మన్మోహన్ సింగ్ భద్రతను పున:సమీక్షించిన కేంద్ర హోంశాఖ.. ఆయనకు ఎస్‌పీజీకి బదులు సీఆర్‌పీఎఫ్ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.అయితే మన్మోహన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read:చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు: 5ప్లస్ 2భద్రతకు గ్రీన్ సిగ్నల్

కాగా.. జడ్‌ప్లస్ సెక్యూరిటీ కింద గాంధీ కుటుంబానికి 100 మంది సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు గాంధీ కుటుంబానికి భద్రతను తగ్గించడంపై కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కరిపిస్తున్నాయి.