భారత్- చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, దేశ ప్రజలు సైనికుల త్యాగాన్ని కొనియాడారు.

తాజాగా ఈ అమరువీరులకు మరింత గౌరవం ఇవ్వాలని భారత ప్రభుత్వం సిద్ధమయినట్లు సమాచారం. నాటి ఘర్షణలో అసువులు బాసిన ఈ 20 మంది సైనికుల పేర్లను ‘ నేషనల్ వార్ మెమోరియల్ ’పై చెక్కేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:గాల్వన్ ఘర్షణ.. చైనా వైపు మనకంటే రెట్టింపు చనిపోయారు: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

మరికొద్దినెలల్లో ఇది ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా  జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో పెట్రోలింగ్ పాయింట్ 14 చుట్టూ చైనా ఒక పరిశీలనా పోస్టును నిర్మించడాన్ని భారత సైనికులు వ్యతిరేకించారు.

దీంతో ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చైనా సైనికులు రాళ్లు, మేకులు దించిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత జవాన్లపై దాడి చేశారు. నాటి ఘటనలో తెలుగు తేజం, 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు మరణించారు.

Also Read:గాల్వన్ ఘర్షణ: ఆ రాత్రి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు ఇవి

చైనా వైపున 35 మంది చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే చైనా వారి జవాన్లకు సైనిక లాంఛనాలతో కాదు కదా.. కనీసం చనిపోయిన వారి పేర్లను కూడా వెల్లడించలేదు. కానీ మనదేశం మాత్రం భారత జవాన్ల త్యాగాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.