గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజున ఇరు వర్గాలు భారీగా తలపడినప్పటికీ చైనా వైపున ఎంతమంది చనిపోయారనే విషయం ఇప్పటివరకు తెలియదు.

అయితే చైనా వైపు మరణించిన వారి సంఖ్య మనకంటే రెట్టింపు ఉంటుందని అభిప్రాయపడ్డారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. గురువారం పశ్చిమ బెంగాల్‌లో వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. భారత్‌కు చెడు చేయాలని చూసేవారికి ధీటైన సమాధానం చెబుతామని హెచ్చరించారు.

ప్రస్తుతం మనం రెండు ‘‘ సీ ’’ల గురించి వింటున్నామని.. వీటిలో ఒకటి కరోనా వైరస్ అని, మరొకటి చైనా అని అన్నారు. భారత ప్రభుత్వం శాంతిపై నమ్మకంతో.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చూస్తుందని రవిశంకర్ వెల్లడించారు.

Also Read:మన దెబ్బ గట్టిగానే తగిలిందిగా.. ఒక్క టిక్‌టాక్ వల్ల చైనాకు ఎంత నష్టమో తెలుసా..?

గల్వాన్ ఘర్షణ తర్వాత వారివైపు జరిగిన ప్రాణ నష్టంపై చైనా ఎలాంటి స్పష్టత ఇవ్వని విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తించాలన్నారు. గతంలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.

అలాగే గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగం వృథా కానివ్వమని మోడీ అన్న మాటలను రవిశంకర్ గుర్తుచేశారు. మరోవైపు 59 చైనీస్ యాప్‌ల నిషేధంపై స్పందిస్తూ... భారతీయులు డేటాను రక్షించేందుకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌ ప్రారంభించారని మంత్రి చెప్పారు.