కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక విషయం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈయన ముందుంటారు. గతంలో.. విదేశాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థులే ఆవుమాంసం తింటున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన ఈసారి ముస్లింలపై పడ్డారు. ముస్లింలందరినీ 1947కి ముందే పాకిస్తాన్ కి పంపించి ఉండాల్సిందంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

Also Read బీహార్ లో అసదుద్దీన్ ఎంఐఎం బోణీ: కేంద్ర మంత్రి గిరిరాజ్ తీవ్ర వ్యాఖ్యలు...

ఇటీవల ఆయన బీహార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు  చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారు.  మన దేశాన్ని మనం అంకితం చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం రాకముందు జిన్నా ఇస్లామిక్ దేశం కోసం ముందుకు కదిలారన్నారు.

ఆ సమయంలోనే ముస్లిం సోదరులందరినీ పాకిస్తాన్ పంపించి.. హిందువులందరినీ ఇక్కడకు రప్పించి ఉంటే దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  భరత వంశస్థులకు ఇక్కడ చోటు నివాసం లభించకపోతే ఎక్కడికి వెళతారు అంటూ ఆయన ప్రశ్నించారు. 

2015 కి ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తామని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రి ఈ విధంగా కామెంట్స్ చేశారు. కాగా.. ఈ కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరి ఆయన కామెంట్స్ పై ముస్లిం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.