ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ మోహన్ జైలు నుండి విడుదల కావడం తమను చాలా నిరుత్సాహపరిచిందని కృష్ణయ్య కూతురు పద్మ అన్నారు.
ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని కృష్ణయ్య భార్య ఉమా మండిపడ్డారు. కృష్ణయ్య ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయినందున బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడడానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. తాజాగా ఆనంద్ మోహన్ విడుదల నిర్ణయంపై కృష్ణయ్య కూతురు పద్మ స్పందించారు.
ఆనంద్ మోహన్ జైలు నుండి విడుదల కావడం తమను చాలా నిరుత్సాహపరిచిందని అన్నారు. బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాల్సిందిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను అభ్యర్థిస్తున్నట్టుగా చెప్పారు. ఈ నిర్ణయంతో నితీష్ కుమార్ సర్కార్ తప్పుడు ఉదాహరణగా నిలిచిందని అన్నారు. ఇది ఒక్క తమ కుటుంబానికే కాదని.. యావత్ దేశానికే అన్యాయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తాము అప్పీలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
Also Read: గ్యాంగ్‌స్టర్ ఆనంద్ విడుదలపై వివాదం.. ప్రధాని జోక్యానికి దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య
నితీష్ కుమార్ ప్రభుత్వం ఇటీవల ప్రిజన్ మాన్యువల్- 2012ను సవరించింది. దీంతో 1994లో అప్పటి గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్, ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం అయింది. ఆయనతో పాటు మరో 26 మంది కూడా జైలు నుంచి విడుదలయ్యేందుకు వీలు కలిగింది.
Also Read: తెలుగు IAS కృష్ణయ్య హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ విడుదల.. కోర్టును ఆశ్రయించిన దళిత సంఘాలు
ఇక, 29 ఏళ్ల క్రితం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేసిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను ఆయన వాహనం ముజఫర్‌పూర్ జిల్లా గుండా వెళుతుండగా ఒక గుంపు కొట్టి చంపింది. అప్పుడేం జరిగిందంటే.. 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యను కారులో నుంచి బయటికి లాగి రాళ్లతో కొట్టి హత్య చేశారు.
