గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్‌ విడుదలపై వివాదం.. ప్రధాని జోక్యానికి దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య

ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Slain IAS officer Krishnaiah wife Uma Request PM To Intervene On Ex MP Anand Mohan Release ksm

హైదరాబాద్‌: ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడుదల చేస్తూ బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ మోహన్ విడుదలపై జి కృష్ణయ్య భార్య ఉమా స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఉమా మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రాజకీయ అవసరాలు ఇలాంటి నిర్ణయాలకు దారితీయకూడదని అన్నారు. రాజకీయాల్లో నేరస్తులను ప్రోత్సహించరాదని పేర్కొన్నారు. తన భర్త ఏ తప్పు చేయకపోయిన దారుణంగా  చంపబడ్డారని చెప్పారు. 

‘‘ఇది (బీహార్) ముఖ్యమంత్రి చాలా తప్పుడు నిర్ణయం. ఎన్నికల్లో పోరాడటానికి మంచి వ్యక్తులను తీసుకోవాలి. అప్పుడే మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది, నేరస్థులను తీసుకుంటే ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతారు. మేము ఈ నిర్ణయంపై విచారంగా ఉన్నాము. అంత మంచి అధికారిని చంపేశారు. ఆయనను చంపడానికి కారణం లేదు’’ అని అన్నారు. దోషులను జీవితాంతం జైలులో పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 

ఈ విషయంలో భవిష్యత్ కార్యాచరణ గురించి అడిగినప్పుడు.. తాను ఒంటరిగా నిర్ణయం తీసుకోలేనని ఉమా చెప్పారు. తన భర్త కృష్ణయ్య 1985 బ్యాచ్ IAS అధికారులు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. రాజకీయాల్లో నేరస్తుల ఉనికిని నిలదీసిన ఆమె.. కృష్ణయ్య విషయంలో జరిగినట్లుగా ఇతరులను హత్య చేయడానికి తప్పుడు వ్యక్తులు వెనుకాడరని అన్నారు.

29 ఏళ్ల క్రితం తన భర్త చనిపోవడంతో తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ మరే కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. ‘‘ఇతరులకు అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వారు తమ స్వార్థం గురించి ఆలోచించకూడదు’’ అని ఉమా అన్నారు. కుల రాజకీయాలు పోవాలని, ప్రభుత్వ నిర్ణయాలలో కులాల ఓట్లు ప్రమాణం కాకూడదని ఆమె ఆకాంక్షించారు. 

కృష్ణయ్య ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయినందున బీహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడడానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమాజంలో తప్పు సంకేతాలు పంపుతోందని.. ప్రధానమంత్రి మోదీ జోక్యం చేసుకుని బీహార్ ప్రభుత్వం  నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని కోరారు. తన భర్త ఒక సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రభుత్వోద్యోగి కావడం వల్లే దాడి జరిగిందని ఆమె తెలిపారు. తన భర్త చనిపోయే సమయానికి తన ఇద్దరు కుమార్తెల వయస్సు 6, 5 సంవత్సరాలు అని చెప్పారు.  కుటుంబాన్ని పోషించడం కోసం తాను ఉద్యోగంలో చేరానని చెప్పారు. 

Also Read: తెలుగు ఐఏఎస్‌ హత్యలో దోషిగా ఆనంద్ మోహన్.. అతడి విడుదలకు నితీశ్ సర్కార్ ఎందుకు సహకరించింది?

ఇదిలా ఉంటే.. ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌తో పాటు 14 ఏళ్లకు పైగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న 26 మందిని విడుదల చేయనున్నారు.ఈ మేరకు బీహార్ ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇక, 29 ఏళ్ల క్రితం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేసిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను ఆయన వాహనం ముజఫర్‌పూర్ జిల్లా గుండా వెళుతుండగా ఒక గుంపు కొట్టి చంపింది. అప్పుడేం జరిగిందంటే.. 1994లో లాలుప్రసాద్‌ యాదవ్‌ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ బ్రిజ్‌ బిహారీ ప్రసాద్‌ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్‌ మోహన్‌ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఐఏఎస్‌ అధికారి జి కృష్ణయ్యను కారులో నుంచి బయటికి లాగి రాళ్లతో కొట్టి హత్య చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios