Asianet News TeluguAsianet News Telugu

కోడలికి ఇంట్లో పురుడు పోయాలని అత్త పట్టు.. పోలీసులు, వైద్యులను అడ్డుకున్న కొడుకు

తరాలు మారుతున్నా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నా జనం మూఢనమ్మకాలను వదలడం లేదు. తమ కుటుంబంలో అందరూ ఇంట్లోనే పురుడు పోసుకున్నారని ఇప్పుడు కూడా అలాగే చేయాలనుకోవడం పద్దతి కాదు కదా..? కానీ తమిళనాడుకు చెందిన ఓ అత్త గారు మాత్రం పాత పద్దతిలోనే తమ కోడలికి పురుడు పోయాలని భీష్మించుకుని కూర్చొన్నారు

mother in law  held for not letting doctors deliver daughter-in-law's baby

తరాలు మారుతున్నా.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నా జనం మూఢనమ్మకాలను వదలడం లేదు. తమ కుటుంబంలో అందరూ ఇంట్లోనే పురుడు పోసుకున్నారని ఇప్పుడు కూడా అలాగే చేయాలనుకోవడం పద్దతి కాదు కదా..? కానీ తమిళనాడుకు చెందిన ఓ అత్త గారు మాత్రం పాత పద్దతిలోనే తమ కోడలికి పురుడు పోయాలని భీష్మించుకుని కూర్చొన్నారు. తేని జిల్లాకు చెందిన కన్నన్ భార్యకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి.

అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే పురుడు పోయాలని కుటుంబసభ్యులు నిర్ణయించి.. అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దీనిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వైద్యులతో కలిసి ఇంటికి చేరుకున్నారు. వీరిని గుమ్మం దగ్గరే కన్నన్ అతని తల్లిదండ్రులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య సాయం అందించడానికి వీల్లేదని.. తమ ఇంట్లో అందరూ ఇలాగే పురుడుపోసుకున్నారని.. అంతా ఆరోగ్యంగా ఉన్నారని వాదించారు.

ఈ పద్ధతి వల్ల తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందని చెప్పినా వారు వినిపించుకోలేదు. కొన్ని గంటల తరువాత ఎట్టకేలకు సిద్ధ వైద్య పద్ధతిలో వైద్యం చేయడానికి అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో.. సిద్ధ వైద్యుడిని పిలిపించి డెలీవరి చేశారు.. అనంతరం కోడలితో పాటు పసిబిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు గాను కన్నన్ తల్లిదండ్రులను, అతనిని అరెస్ట్ చేశారు.

దీనిపై సోషల్ మీడియాలో విస్త్రృతంగా కథనాలు రావడంతో తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్పందించారు. రాష్ట్రంలో ఇక మీదట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత నెలలో కూడా యూట్యూబ్‌లో వీడియోలు చూసి నెలలు నిండిన భార్యకు డెలీవరి చేసేందుకు భర్త ప్రయత్నించాడు. ఈ ఘటనలో బిడ్డకు జన్మనిచ్చిన భార్య మరణించింది.

Follow Us:
Download App:
  • android
  • ios