Sydney: భారత ప్రధాని నరేంద్ర మోడీని 'బాస్' గా ఆస్ట్రేలియా ప్రధాని అభివర్ణించారు. సిడ్నీలో సుమారు 20,000 మంది భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. మోడీ రెండు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
PM Modi is the Boss: సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనాకు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఘనస్వాగతం పలికారు. తనకు, ప్రవాస భారతీయులకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రవాస భారతీయులు, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ ది బాస్ అంటూ రాక్‌స్టార్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌తో పోల్చారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే సిడ్నీలో సుమారు 20,000 మంది ప్రవాస భారతీయులతో సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోడీ వెంట ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ అల్బనీస్ కూడా ఉన్నారు. "2014లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ భారత ప్రధాని కోసం 28 ఏళ్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని మీకు మాట ఇచ్చాను. ఈ రోజు సిడ్నీలోని ఈ ఎరీనాలో, నేను మళ్ళీ ఇక్కడ ఉన్నాను.. నేను ఒంటరిగా రాలేదు. ప్రధాని అల్బనీస్ కూడా నా వెంట ఉన్నారు" అని అన్నారు.
భారత్, ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం, గౌరవంతో ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనాలో 'మోడీ మోడీ' నినాదాల మధ్య రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రధాని కొనియాడారు. స్వాగతం పలికిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత సంబంధాలు తరచూ '3సీ', '3డీలు', '3ఈ'లతో ముడిపడి ఉన్నాయనీ, అవి ఇప్పుడు ఈ లేబుళ్లను మించిపోయాయని అన్నారు. భారత్, ఆస్ట్రేలియా సంబంధాలను 'కామన్వెల్త్, క్రికెట్, కర్రీ' అనే 3సీల ద్వారా నిర్వచించామని గతంలో చెప్పారు. అప్పుడు మా బంధాన్ని 'ప్రజాస్వామ్యం, డయాస్పోరా, దోస్తీ' అని నిర్వచించారు. మన బంధం 'ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్'పై ఆధారపడి ఉందని కూడా కొందరు చెప్పారు. కానీ భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు అంతకు మించినవని, ఇది పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం అని నేను నమ్ముతున్నాను' అని ప్రధాని అన్నారు.
విభిన్న జీవన విధానాలు ఉన్నప్పటికీ, భారతదేశం, ఆస్ట్రేలియా రెండూ తమ గణనీయమైన బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి పరస్పర ఆసక్తి ఉన్న రంగాలను కనుగొన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. "మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతోంది. క్రికెట్ కారణంగా మేం చాలా కాలంగా కనెక్ట్ అయ్యాం. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని కనెక్ట్ చేస్తున్నాయి. మేము వివిధ పద్ధతుల్లో ఆహారాన్ని తయారు చేయవచ్చు, కానీ మాస్టర్ చెఫ్ ఇప్పుడు మమ్మల్ని కలుపుతోంది" అని ఆయన అన్నారు.
