అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల విలీనం, సర్జికల్స్ స్ట్రైక్స్, ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే ఒకే దేశం-ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వేతనాల విషయంలోనూ ఈ దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలోని ఉంచుకుని ‘‘వన్ నేషన్-వన్ పే డే’ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు.

శుక్రవారం ఢిల్లీలోని సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా సకాలంలో ఒకే రోజు వేతనాలు అందించేందుకు సిద్ధమవుతున్నామని.. ఇందుకోసం ఉద్దేశించిన చట్టాన్ని ప్రధాని త్వరలోనే తీసుకురాబోతున్నారన్నారు.

Also Read:రజినీకాంత్ కి కమల్ హాసన్ మద్దతు.. ఆయన చెప్పినదాంట్లో తప్పేముందంటూ...

కార్మికులు మెరుగైన జీవితం గడిపేందుకు అన్ని రంగాల్లో కనీస వేతనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కార్మిక సంస్కరణలను చేపట్టిందని సంతోష్ గుర్తుచేశారు. 44 కార్మిక చట్టాలను సంస్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.3 వేల పెన్షన్‌తో పాటు వైద్య బీమా అందించేందుకు ప్రభుత్వం యోచిస్తొందన్నారు. అలాగే కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు మరిన్ని పథకాలు తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.

దేశంలో ఎక్కువు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వాటిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ అతిపెద్దదని.. ప్రస్తుతం 90 లక్షల ఇందులో ఇందులో పనిచేస్తున్నారని గాంగ్వర్ తెలిపారు.

44 కార్మిక చట్టాలను నాలుగు వర్గాలుగా విభజించి చట్టాలు చేయాలని మోడీ ప్రభుత్వం సంకల్పించిందని.. దీనిలో భాగంగా 13 కార్మిక చట్టాలను ఒకే కోడ్‌ కిందకు తీసుకొస్తూ వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిచేసే పరిస్ధితులకు సంబంధించి కోడ్ బిల్లును సిద్దం చేసిందని సంతోష్ పేర్కొన్నారు.

Also Read:రాఫెల్ విమానాల డీల్ కేంద్రానికి ఊరట: టైమ్ లైన్...

కార్మికుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్ధితులకు సంబంధించిన మొత్తం చట్టాలు ఇందులో ఉన్నాయన్నారు. ఓఎస్‌హెచ్ కోడ్ బిల్లును ఈ ఏడాది జూలై 23న ప్రవేశపెట్టినప్పటికీ అభ్యంతరాల నేపథ్యంలో ఆమోదం పొందలేదని సంతోష్ గాంగ్వర్ వెల్లడించారు. ఈ ఓఎస్‌హెచ్‌ కోడ్‌లో ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్ తప్పనిసరి చేయడం, ఏటా ఉచిత మెడికల్ చెకప్‌ వంటివి ఉన్నాయని సంతోష్ తెలిపారు.