Asianet News TeluguAsianet News Telugu

వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం టైర్ చోరీ.. స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ‘ట్రక్ టైర్ అనుకున్నాం’

ఉత్తరప్రదేశ్‌లో వైమానిక దళానికి చెందిన మిరేజ్ - 2000 జెట్ టైర్‌ చోరీకి గురైంది. నవంబర్ 27వ తేదీ రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ నెల 4వ తేదీని ఇద్దరు వ్యక్తులు ఈ టైర్‌ను యూపీలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు అప్పగించారు. అది తమకు రోడ్డుపై లభించిందని, ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వివరించినట్టు పోలీసులు వివరించారు.
 

mirage2000 fighter jet tyre stolen in UP
Author
Lucknow, First Published Dec 5, 2021, 2:06 PM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. వైమానిక దళానికి(Air Force) చెందిన ఒక యుద్ధ విమానం టైర్‌ను (Mirage- 2000 Tyre) దొంగిలించిన ఘటన రిపోర్ట్ అయింది. ఈ ఘటన కలకలం రేపింది. గత నెల 27వ తేదీ రాత్రిపూట ఈ చోరీ జరిగింది. దీనిపై లక్నోని ఆషియానా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ సమీపం ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇంతలోనే ఈ నెల 4వ తేదీన ఇద్దరు వ్యక్తులు ఆ ఫైటర్ జెట్ టైర్‌ను ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు తెచ్చారు. చోరీ రిపోర్ట్ అయిన ప్రాంతంలో వారికి ఆ టైర్ దొరికిందని చెప్పారు. అది ట్రక్ టైర్ అనుకుని ఇంటికి తీసుకెళ్లామని వారిద్దరూ చెప్పినట్టు పోలీసులు వివరించారు.

ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం మిరేజ్-2000 జెట్ టైర్లు, ఇతర పరికరాలను బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి జోధ్‌పూర్ ఎయిర్ బేస్‌కు తరలిస్తున్నారు. జోధ్‌పూర్ ఎయిర్ బేస్ ఆర్డర్ మేరకు ఈ తరలింపు జరిగింది. మిరేజ్-2000 జెట్‌కు ఐదు టైర్లను, ఇతర ఎక్విప్‌మెంట్‌లను ఓ లారీ లోడ్ చేసుకుని ఉత్తరప్రదేశ్‌లోని బక్షి కా తలాబ్ ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరింది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని షహీద్ పాఠ్‌కు ఆ లారీ చేరగానే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నది. అక్కడే కొద్ది సేపు ట్రక్కు‌ను ఆ డ్రైవర్ నిలిపాడు. ఇంతలోనే ఆ లోడ్‌లో ఒక టైర్ కనిపించకుండా పోయినట్టు ఆయన గుర్తించారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఆయన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. నవంబర్ 27 రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

Also Read: కాబూల్‌లో ఉక్రెయిన్ ప్లేన్ ఎత్తుకెళ్లారు: ఔను.. హైజాక్ చేశారన్న డిప్యూటీ మినిస్టర్

పోలీసులు ఆ డ్రైవర్‌ను ఇంటరాగేట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా, ఆ ట్రక్ షహీద్ పాఠ్ చేరుకున్నాక అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటాన్ని కొందరు దుండగులు అదును చేసుకున్నట్టు ఇంకొందరు చెబుతున్నారు. భారీ ట్రాఫిక్‌ను అదునుగా తీసుకుని బ్లాక్ స్కార్పియోలో వెళ్తున్న దుండగులు లారీ నుంచి మిరేజే-2000 టైర్‌ను దొంగించినట్టు ఆరోపణలు చేశారు. అయితే, నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉన్నది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేశారు.

కానీ, డిసెంబర్ 4వ తేదీన ఇద్దరు వ్యక్తులు చోరీకి గురైన మిరేజ్-2000 టైర్‌ను తీసుకుని బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వెళ్లారు. ఆ టైర్ తమకు రోడ్డుపై దొరికిందని వివరించినట్టు పోలీసులు వెల్లడించారు. వారు చెప్పిన ప్రాంతంలోనే ఆ టైర్ చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఆ టైర్ ట్రక్కు టైర్ అనుకుని పొరబడ్డామని, అందుకే ఆ టైర్‌ను ఇంటికి తీసుకెళ్లామని వారిద్దరూ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. బక్షి కా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సిబ్బంది ఆ టైర్‌ను పరిశీలించారు. అది తమ డిపోకు చెందినదేనని గుర్తించారు. అది మిరేజ్-2000 జెట్‌దేనని ధ్రువీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios