Meta: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను తొలగించిన ఘటనపై మెటా సంస్థ వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారంపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు తెలిపారు. అలాగే ప‌లు లోపాల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

పార్లమెంటరీ కమిటీ ఆదేశాల తర్వాత మెటా స్పందన

జులై 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియోను మెటా ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ ఘటనపై పార్లమెంటరీ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా స్పందించింది. వీడియో తొలగింపున‌కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ఘటనపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మెటాకు మూడు రోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మెటా స్పందిస్తూ జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది.

డీప్‌ఫేక్, CSAM కంటెంట్‌పై అంగీకారం

ప్రకటనలో మార్క్ జుకర్‌బర్గ్ తమ ప్లాట్‌ఫామ్‌లో డీప్‌ఫేక్ కంటెంట్, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అరికట్టడంలో కొన్ని లోపాలు ఉన్నాయని అంగీకరించారు. అలాగే కొన్ని రకాల కంటెంట్‌కు అధిక ప్రాధాన్యం కల్పించే ప్రక్రియలో నిర్వహణపరమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ప్లాట్‌ఫామ్ భద్రత, విశ్వసనీయతను మరింత మెరుగుపరిచేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, హానికర కంటెంట్‌ను నియంత్రించేందుకు సాంకేతిక వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

భవిష్యత్తులో మరింత కట్టుదిట్టమైన చర్యలు

భారత్‌లో మెటా కార్యకలాపాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సంస్థ తన విధానాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంటెంట్ పర్యవేక్షణ వ్యవస్థను మరింత పకడ్బందీగా రూపొందిస్తామని మార్క్ జుకర్‌బర్గ్ హామీ ఇచ్చారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై చర్చకు దారితీసింది.