భార్య అందంగా లేదని చిత్రహింసలకు గురిచేసి ఆమెను మానసికంగా కృంగదీసి బలవన్మరణానికి కారణమయ్యే వారు కొందరైతే, చంపేవాళ్లు ఇంకొందరు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా భార్య అందంగా ఉందని అసూయతో ఆమెను పీడించి మరణానికి కారణమయ్యాడో భర్త.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగర జిల్లా అనేకల్ తాలూకా మాదప్పన హళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణి భార్య జయశ్రీ ఆదివారం రాత్రి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది.

Also Read:కొడుకుని బెడ్ బాక్స్ లో కుక్కి ప్రియుడితో లేచి పోయిన మహిళ

గ్రామానికి చెందిన సుబ్రమణికి రెండేళ్ల కిందట హోసకోటే ప్రాంతానికి చెందిన జయశ్రీతో వివాహం జరిగింది. ఆమె అతనికంటే చాలా అందంగా ఉండటంతో సుబ్రమణికి అసూయ కలిగింది. ఆమె ముందు తాను తక్కువ స్థాయిలో ఉన్నట్లు ఆత్మన్యూనతకు గురయ్యేవాడు. అప్పటి నుంచి సూటిపోటీ మాటలతో జయశ్రీని వేధించేవాడు.

నువ్వు నా కంటే చాలా అందంగా ఉన్నావ్, నాతో పాటు బయటికి రావొద్దు అంటూ మానసికంగా వేధించసాగాడు. ఈ క్రమంలో ఓ రోజున తాను సినిమా తీయాలని అనుకుంటున్నానని ఇందుకోసం పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని రా అంటూ వరకట్నం కోసం పీడించేవాడు.

చివరికి గుడికి వెళ్లినా.. తాను ఒక లైన్‌లో భార్యను మరో లైన్‌లో వెళ్లాలని హెచ్చరించేవాడు.. అందంగా అలంకరించుకుంటే, ఇంట్లో ముస్తాబు ఎందుకు అంటూ ప్రశ్నించేవాడు. రాను రాను భర్త వేధింపులు ఎక్కువ కావడంతో జయశ్రీలో సహనం నశించి ఓ రోజున తల్లీదండ్రులకు మొరపెట్టుకుంది.

దీంతో వారు పంచాయతీ పెట్టించి భార్యాభర్తలకు నచ్చజెప్పారు. అయినప్పటికీ సుబ్రమణిలో మార్పు రాలేదు. పుట్టింటి నుంచి వరకట్నం తీసుకురావాలని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జయశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక భర్త దగ్గర ఉండలేనని, తీసుకుని వెళ్లాల్సిందిగా బోరుమంది.

Also Read:ప్రేమ పెళ్లి చేసుకున్నాడని... శోభనానికి ముందే కొడుకు పురుషాంగం కోసి..

తాము ఒకటి రెండు రోజుల్లో వచ్చి తీసుకుని వెళ్తామని తల్లీదండ్రులు చెప్పడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో జయశ్రీ శవమై తేలింది.

ఘటనాస్థలికి చేరుకున్న సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని, సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నారు. అల్లుడే తమ కుమార్తెను హత్య చేశాడని జయశ్రీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.