న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. 

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ తరపున ఎంపీ మనీష్ తివారీ సీరియస్ గా స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్ 370ను రద్దు చేయడం సరికాదన్నారు. ఒకవైపు కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన పెట్టి 370 అధికరణ రద్దు చేయడం ఏంటని నిలదీశారు. 

ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి పాలన అమల్లోకి తెచ్చి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ హక్కులను పార్లమెంటులో ఉపయోగించుకుని ఆర్టికల్ 371ని కూడా రద్దు చేయవచ్చని తెలిపారు. కేంద్రప్రభుత్వం ఇలాంటి నిర్ణయాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి సందేశం ఇవ్వదలచుకుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  

మనీష్ తివారీ వ్యాఖ్యలకు హోంమంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని కోరారు. రద్దుకు అనుకూలమా లేక వ్యతిరేకమా అనేది తేల్చి చెప్పాలని అన్నారు. 

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని అనుకుంటున్నారా లేదా? అంటూ సెటైర్లు వేశారు. పార్లమెంటుకు ఎలాంటి అధికారులు ఉన్నాయో తెలుసా అంటూ ప్రశ్నించారు. కశ్మీర్‌పై పార్లమెంటులో చట్టం చేయాలంటూ ఐక్యరాజ్యసమితి అనుమతి తీసుకోవాలా అంటూ సెటైర్లు వేశారు.  

పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్ అనేవి కశ్మీర్‌లో అంతర్భాగమని భారత రాజ్యంగం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దానిపై ఎలాంటి చట్టాలైనా చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, అందుకు ఎవరి అనుమతి అవసరం లేదని అమిత్‌షా కుండబద్ధలు కొట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా