మణిపూర్ ఘటనపై చర్చించాల్సిందే : విపక్షాల పట్టు.. లోక్‌సభలో గందరగోళం, సభ రేపటికి వాయిదా
మణిపూర్ హింస, తదితర పరిణామాలు పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. దీనిపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు.
మణిపూర్ హింస, తదితర పరిణామాలు పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో లోకసభను రేపటికి వాయిదా చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో రాజస్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగా.. జూన్‌లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హరద్వార్ దూబేకి నివాళిగా సభను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
అయితే తిరిగి 12 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ చైర్మన్ సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు పార్లమెంట్ వెలుపల కూడా మణిపూర్ ఘటనపై నిరసన తెలిపేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి.
ALso Read: మణిపూర్ ఘటనపై చర్చకు విపక్షాల పట్టు.. రాజ్యసభలో గందరగోళం.. సభ వాయిదా..
రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలపై సభాపక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్షాల తీరు చూస్తుంటే పార్లమెంట్‌ను నడపకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని.. మణిపూర్ ఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసినా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి’’ అని చెప్పారు.
ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం తమ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ హింస అంశాన్ని లేవనెత్తాలని, ఈశాన్య రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేయాలని నాయకులు నిర్ణయించారు. తమ కూటమి 'INDIA' ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహంపై విపక్ష పార్టీల తొలి సమావేశం ఇది.