మణిపూర్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను రక్షించేందుకు ఆయా రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రత్యేక విమానాలు, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి.
మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో స్థానికులతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పౌరులను రక్షించేందుకు ఆయా రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రత్యేక విమానాలు, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. మణిపూర్‌లో తాజా పరిణామాలను తమ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని.. అక్కడ చిక్కుకుపోయిన విద్యార్ధులను తిరిగి తీసుకురావడానికి తనశక్తి మేరకు అన్ని విధాలా కృషి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
మహారాష్ట్రకు చెందిన 22 మంది విద్యార్ధులు అక్కడ చదువుకుంటున్నారు. వీరిలో వికాస్ శర్మ, తుషార్ అవద్‌లతో తాను మాట్లాడానని.. వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తానని షిండే హామీ ఇచ్చారు. ధైర్యం వుండాలని.. ఆందోళన చెందొద్దని ఆయన భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ సౌనిక్ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేశానని షిండే పేర్కొన్నారు.
Also Read: Manipur Violence: హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్.. 54 మంది మృతి
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మణిపూర్‌లో చదువుతున్న విద్యార్ధులను తిరిగి తీసుకొచ్చేందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. తాము మణిపూర్ ప్రభుత్వం, అక్కడి అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు టచ్‌లోనే వున్నామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలావుండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం మణిపూర్‌లో వున్న తమ రాష్ట్ర విద్యార్ధులను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అత్యవసర సాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామని మమతా బెనర్జీ తెలిపారు. మణిపూర్ నుంచి వస్తున్న మెసేజ్‌లు, ఎస్‌వోఎస్‌ల పట్ల తాను తీవ్ర ఆవేదన చెందినట్లు సీఎం అన్నారు. మణిపూర్ ప్రజలు, అక్కడ వున్న దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు మమత ట్వీట్ చేశారు.
ప్రజల పక్షాన నిలబడేందుకు బెంగాల్ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. మణిపూర్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అక్కడ చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని తాము నిర్ణయించామన్నారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాలని, అక్కడ చిక్కుకున్న వారిని రక్షించాలని సీఎస్‌ను ఆదేశించినట్లు మమతా బెనర్జీ వెల్లడించారు.
Also Read: మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజల రక్షణకు ప్రభుత్వ చర్యలు.. ప్రత్యేక విమానాల ఏర్పాటు
అటు మణిపూర్‌ను ఆనుకుని వుండే నాగాలాండ్ కూడా తమ పౌరులను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. అక్కడ వున్న 600 మందిని క్షేమంగా తరలించేందుకు గాను 22 బస్సులను మోహరించామని నాగాలాండ్ సీఎం వై పాటన్ తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి మాణిక్ సాహా నేతృత్వంలోని త్రిపుర ప్రభుత్వం విద్యార్ధులను తరలించేందుకు రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది.
మరోవైపు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పౌరులను తరలించడానికి , మణిపూర్‌కు అదనపు దళాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేసింది. అయితే మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ సడలించారు. కానీ సైన్యం డ్రోన్లు, హెలికాఫ్టర్ల సాయంతో వైమానిక నిఘా పెట్టింది. మణిపూర్ ప్రభుత్వ సమన్వయంతో ఏఏఐ.. ఇంఫాల్‌లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 24 గంటల విమాన కార్యకలాపాలను నిరవధికంగా పొడిగించింది. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినందున, ఒంటరిగా ఉన్న ప్రయాణీకులకు అందుబాటులో వున్న ఆహార సదుపాయంతో ఫ్లైట్ టిక్కెట్ల ముద్రణ కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎల్ఏఎన్ సౌకర్యంతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసింది.
