Manipur Violence: మణిపూర్ లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 54కు పెరిగింది. శాంతి భద్రత పరిరక్షణ చర్యలు ప్రారంభించిన సర్కారు.. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
Manipur Violence-Death Toll Rises To 54: గిరిజనులు, గిరిజనేతరుల ఆందోళనల నేపథ్యంలో మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హింసాత్మక ఘర్షణల కారణంగా 54 మంది చనిపోయారు. శాంతి భద్రత పరిరక్షణ చర్యలు ప్రారంభించిన సర్కారు.. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇప్పటికే ఆర్మీ పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తోంది.
వివరాల్లోకెళ్తే.. మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, శనివారం (మే 6) ఇంఫాల్ లోయలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడంతో, దుకాణాలు, మార్కెట్లు తెరుచుకోవడం, కార్లు రోడ్లపై తిరగడం కనిపించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. మణిపూర్ ను చుట్టుముట్టిన జాతి హింసలో మరణించిన వారి సంఖ్య 54కు పెరిగింది. అనధికారిక వర్గాల నివేదికల ప్రకారం.. మణిపూర్ హింసాకాండలో మృతుల సంఖ్య వందకు పైగా ఉంటుందని సమాచారం. గాయపడిన వారి సంఖ్య దాదాపు 200పైగా ఉంది. ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనాలనీ, జాతి వర్గాల మధ్య చర్చలు జరగాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు.
మణిపూర్ హింసకు సంబంధించి తాజా వివరాలు ఇలా ఉన్నాయి..
- మణిపూర్ సీఎం అధ్యక్షత అఖిలపక్ష సమావేశం: రాష్ట్రంలో హింస చెలరేగిన నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీరేన్ సింగ్ స్వయంగా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్పీఎఫ్, ఎన్పీపీ, సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన వంటి రాజకీయ పార్టీలు హాజరయ్యాయి.
- ప్రతి నియోజకవర్గంలో శాంతి కమిటీలు: శాంతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. హింస-సంఘర్షణ మూల కారణాలను గుర్తించడానికి, పరిష్కరించడానికి, అలాగే సమాజాల మధ్య శాంతియుత చర్చలు-సహకారాన్ని ప్రోత్సహించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది.
- నీట్-యూజీ పరీక్షలు వాయిదా: నీట్-యూజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. త్వరలో కొత్త తేదీ విడుదల ప్రకటించనున్నారు. మణిపూర్ లో మే 7న జరగాల్సిన మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్-యూజీని రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. మణిపూర్ లో పరీక్ష కేంద్రం ఉన్న అభ్యర్థులకు పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
- అసోంలోకి 11 వేల మంది మణిపూర్ ప్రజలు: రాష్ట్రంలో హింస నేపథ్యంలో మణిపూర్ లోని జిరిబామ్ జిల్లా, పరిసర ప్రాంతాలకు చెందిన 1,100 మందికి పైగా ప్రజలు అంతర్రాష్ట్ర సరిహద్దు దాటి అసోంలోని కచార్ జిల్లాలోకి ప్రవేశించారు. చాలా మంది రక్షణ కోసం రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నారు.
- శాంతిని పునరుద్ధరించండని ఇరోమ్ షర్మిల పిలుపు: మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు జాతికి అతీతంగా మహిళలు కలిసి పనిచేయాలని పౌరహక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిల చాను పిలుపునిచ్చారు. సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించాలని ఆమె కోరారు.
- కుటుంబంతో మాట్లాడలేకపోతున్నాం: ఆసియా చాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ బిండ్యారాణి దేవి శనివారం సుదూర కొరియాకు వెళ్లింది. మరీ ముఖ్యంగా, తన స్వరాష్ట్రంలో జాతి హింస కారణంగా ఇంటర్నెట్ అంతరాయం కారణంగా రెండు రోజులుగా వారితో కమ్యూనికేట్ చేయలేకపోయినందున వారి భద్రత గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
- పౌరుల రక్షణకు చర్యలు: ఉద్రిక్త హింసాత్మక ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి పొరుగు రాష్ట్రాలు రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, తెలంగాణ రాష్ట్రం నుండి తమ పౌరులను రక్షించడానికి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
