మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్ర‌జ‌ల రక్షణకు ప్ర‌భుత్వ చ‌ర్య‌లు.. ప్ర‌త్యేక విమానాల ఏర్పాటు

Hyderabad: హింసాత్మ‌క ఘ‌ట‌న‌లతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, స్థానికులను తీసుకురావడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీనిలో భాగంగా మ‌ణిపూర్ లో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌ల‌ను తీసుకురావ‌డానికి ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 
 

Telangana government's efforts to bring back those stranded in Manipur RMA

Manipur Violence: మణిపూర్ లో ఉద్రిక్త‌ పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడంతో తెలంగాణ విద్యార్థులను, ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో నివసిస్తున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్, పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. మే 7న ఇంఫాల్ విమానాశ్రయం నుంచి తెలంగాణ విద్యార్థులు, స్థానికులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. మణిపూర్ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.

తెలంగాణ ప్రజల కోసం 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ ఏర్పాటు

మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలంగాణ ప్రజల కోసం 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. సంబంధిత వివ‌రాల‌ను డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సహాయం అవసరమైన వారు సహాయం కోసం 7901643283 లేదా ఇమెయిల్ ద్వారా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐపీఎస్-డీఐజీ) సుమతిని సంప్రదించవచ్చని ఆయన తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు.
 

 

మణిపూర్ హింసాత్మక ఘర్షణల్లో 54 మరణించారు..

మ‌ణిపూర్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే, శనివారం (మే 6) ఇంఫాల్ లోయలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకోవడంతో, దుకాణాలు, మార్కెట్లు తెరుచుకోవడం, కార్లు రోడ్లపై తిరగడం క‌నిపించింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప‌రిస్థితులు దారుణంగానే ఉన్నాయి. మణిపూర్ ను చుట్టుముట్టిన జాతి హింసలో మరణించిన వారి సంఖ్య 54కు పెరిగింది. అనధికారిక వర్గాల నివేదిక‌ల ప్రకారం.. మ‌ణిపూర్ హింసాకాండలో మృతుల సంఖ్య వందకు పైగా ఉంటుంద‌ని స‌మాచారం. గాయపడిన వారి సంఖ్య దాదాపు 200పైగా ఉంది. ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనాలనీ, జాతి వర్గాల మధ్య చర్చలు జ‌ర‌గాల‌ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు పేర్కొన్నారు. 

రాష్ట్రంలో హింస చెలరేగిన నేపథ్యంలో మ‌ణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీరేన్ సింగ్ స్వయంగా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్పీఎఫ్, ఎన్పీపీ, సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన వంటి రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. శాంతి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. హింస-సంఘర్షణ  మూల కారణాలను గుర్తించడానికి, పరిష్కరించడానికి, అలాగే సమాజాల మధ్య శాంతియుత చర్చలు-సహకారాన్ని ప్రోత్సహించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios