మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మణిపూర్‌లో పరిస్థితిపై ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. మణిపూర్‌లో పరిస్థితిపై ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మే 4వ తేదీన ఈ దారుణం జరిగిన రోజున.. అసలు ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే దుండగులు నగ్నంగా ఊరేగింపు జరిపిన మహిళల్లో ఒకరి తల్లి.. ఈ ఘటన గురించి చెబుతూ తీవ్ర మనోవేదనతో కన్నీరు పెట్టుకున్నారు.
మణిపూర్‌లో హింసను ఆపడానికి లేదా ప్రజలను రక్షించడానికి మణిపూర్ ప్రభుత్వం తగినంతగా చేయలేదని ఆరోపించారు. హింసాత్మక గుంపు ఆమె కుమార్తెను దారుణంగా బట్టలు విప్పి దాడి చేసిన హృదయ విదారక క్షణాన్ని గుర్తుచేసుకున్నారు. తన కూతురుని వివస్త్రను చేసి ఊరేగించడానికి ముందు తన భర్త, కొడుకును చంపేశారని చెప్పారు.
‘‘నాకు చాలా కోపంగా, ఆవేశంగా ఉంది.. ఆమె తండ్రిని, తమ్ముడిని కూడా కిరాతకంగా హతమార్చి, ఈ అవమానకరమైన పనికి పాల్పడ్డారు.. చాలా బాధపడ్డాను. మణిపూర్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. తండ్రులు, తల్లులు.. మనమే నష్టపోతున్నాం.భగవంతుని దయ వల్ల నేను శారీరకంగా బాగానే ఉన్నాను.. కానీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆలోచిస్తాను. నేను ఇటీవల చాలా బలహీనంగా ఉండటంతో డాక్టర్‌ను సంప్రదించాను’’ అని ఆమె ఎన్డీటీవీకి చెప్పారు.
Also Read: మణిపూర్ వీడియో: దేశాన్ని రక్షించాను, కానీ భార్యను కాపాడుకోలేకపోయాను.. కార్గిల్ యుద్దవీరుడి ఆవేదన
‘‘నాకు ఆశాకిరణమైన నా చిన్న కొడుకును పోగొట్టుకున్నాను. అతడిని చదివించేందుకు చాలా కష్టపడ్డాం. 12వ తరగతి పూర్తి చేశాడు.. మాకు అండగా ఉంటాడని భావించాం. ఇప్పుడు అతని తండ్రి కూడా లేరు. మా పెద్దకొడుకుకు ఉద్యోగం లేదు. కాబట్టి మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకేమీ ఆశాజనకంగా లేదు. మా ఊరు తిరిగి వెళ్ళే అవకాశం లేదు. ఆ ఆలోచన నా మదిలో కూడా లేదు. మేము తిరిగి వెళ్ళలేము. నాకు తిరిగి వెళ్ళడం ఇష్టం లేదు. మా ఇళ్లు తగులబెట్టబడ్డాయి. మా పొలాలు ధ్వంసమయ్యాయి. నేను తిరిగి దేనికి వెళ్తాను? నా గ్రామం కాలిపోయింది. నా కుటుంబం భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు.. నేను తిరిగి అక్కడికి వెళ్లలేను’’ అని ఆమె పేర్కొన్నారు.
ఇక, వైరల్‌గా మారిన వీడియోలోని ఘటన మే 4వ తేదీన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఎఫ్‌ఐఆర్‌లో వివరించిన విధంగా ముగ్గురు మహిళలను బలవంతంగా వివస్త్రను చేయించారు. వారిలో 21 ఏళ్ల వయసున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె సోదరుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. అతడిని హత్య చేశారు. ఇక, వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.
