మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే దుండగులు నగ్నంగా ఊరేగింపు జరిపిన మహిళల్లో ఒకరి భర్త మాజీ సైనికుడు. ఆయన కార్గిల్ యుద్దంలో దేశం కోసం పోరాడారు.
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్‌గా మారడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. అయితే దుండగులు నగ్నంగా ఊరేగింపు జరిపిన మహిళల్లో ఒకరి భర్త మాజీ సైనికుడు. ఆయన కార్గిల్ యుద్దంలో దేశం కోసం పోరాడారు. ఆయన అస్సాం రెజిమెంట్‌కు సుబేదార్‌గా భారత సైన్యంలో పనిచేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. తాను దేశాన్ని కాపాడాను, కానీ తన భార్యను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నేను కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. భారత శాంతి పరిరక్షక దళంలో భాగంగా శ్రీలంకలో కూడా ఉన్నాను. నేను దేశాన్ని రక్షించాను, కానీ నా పదవీ విరమణ తర్వాత, నా ఇంటిని, నా భార్యను, తోటి గ్రామస్థులను రక్షించుకోలేకపోయాను’’ అని ఆ మాజీ సైనికుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను బాధలో, నిరాశలో ఉన్నానని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘పోలీసులు అక్కడ ఉన్నారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇళ్లను తగలబెట్టిన, మహిళలను అవమానించిన వారందరికీ సరైన శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను’’ అని ఆయన చెప్పారు.
‘‘కార్గిల్‌లో ముందు భాగంలో యుద్ధం జరగడం నేను చూశాను. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు (నా పదవీ విరమణ తర్వాత).. నా సొంత స్థలం యుద్ధభూమి కంటే ప్రమాదకరమైనది’’ అని ఆ మాజీ సైనికుడు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
‘‘వారు మా గ్రామానికి వచ్చి ఇళ్లను తగులబెట్టడం ప్రారంభించారు. గ్రామస్థులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నా భార్య నా నుంచి తప్పిపోయింది. ఆమె, మరో నలుగురు గ్రామస్తులు అడవిలో దాక్కున్నారు. మా పందులు మరియు కోళ్ళను వెంబడిస్తూ గ్రామంలోకి ప్రవేశించిన కొంతమంది దాడి చేసినవారు.. అక్కడ దాక్కున్నట్లు కనుగొన్నారు. వారు నా భార్యను, ఇతరులను చాలా దూరం తీసుకెళ్లడం నేను చూశాను’’ అని మాజీ సైనికుడు పేర్కొన్నాడు.
ఇక, వైరల్‌గా మారిన వీడియోలోని ఘటన మే 4వ తేదీన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఎఫ్‌ఐఆర్‌లో వివరించిన విధంగా ముగ్గురు మహిళలను బలవంతంగా వివస్త్రను చేయించారు. వారిలో 21 ఏళ్ల వయసున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె సోదరుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. అతడిని హత్య చేశారు. ఇక, వీడియో బయటకు వచ్చిన ఒక రోజు తర్వాత గురువారం ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.
