మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ పక్షపాత వైఖరితో మసలుకుంటున్నారని, రాష్ట్రంలో మైతేయీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతుంటే ఆయన మైతేయీ వర్గం వైపు నిలబడ్డారన్న వాదనలకు బలం చేకూర్చేలా సీఎం ఎన్ బీరెన్ సింగ్ ట్వీట్లు చేశారు. 

న్యూఢిల్లీ: మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ పక్షపాతం వహిస్తున్నారనే ఆరోపణలు మరింత బలపడ్డాయి. మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు మైతేయీ, మరో వైపు కుకీలు. ఈ రెండు జాతుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. మే నెల 3వ తేదీ నుంచి ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలను కట్టడి చేయడం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాక.. మైతేయీ వర్గానికి చెందిన సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఎదుటి పక్షం కుకీలపై పక్షపాత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలూ హింసను ఎగదోశాయి. తాజాగా, సీఎం ఎన్ బీరెన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుకీల పట్ల పక్షపాత వ్యూహంతో ఉన్నారనే అభిప్రాయాలను బలోపేతం చేశాయి. కుకీలపై ఇప్పటికే కొన్ని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. మయన్మార్‌కు చెందిన వారిని కుకీలు ఏకం చేసుకుంటున్నారని, కుకీల్లో చాలా మంది అక్రమంగా దేశంలోకి చొరబడ్డా బర్మా వాసులు ఉన్నారనేవి తీవ్ర ఆరోపణలు. అంతేకాదు, కుకీలకు, మైతేయీ వర్గానికి మధ్య విభేదాలను రేకెత్తించే మరెన్నో ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో ఈ రోజు సీఎం ఎన్ బీరెన్ సింగ్ కొన్ని ట్వీట్లకు సమాధానం ఇచ్చారు. మీరు ఎప్పుడో సీఎంగా రాజీనామా చేయాల్సిందనే కుకీ తెగకు చెందిన నెటిజన్ ట్వీట్ చేయగా.. నువ్వు అసలు భారతీయుడివేనా? లేక మయన్మార్ దేశస్తుడివా? అని బీరెన్ సింగ్‌ నుంచి ప్రశ్న వచ్చింది. మణిపూర్ సరిహద్దు మయన్మార్‌తో పంచుకుంటున్నది. కొన్ని కిలోమీటర్ల మేరకు ఈ రెండు దేశాల ప్రజలు ఎలాంటి ఆటంకాలు, ఆంక్షలు లేకుండా తిరగడానికి అవకాశం ఉన్నది. కుకీల ప్రజలకు.. మయన్మార్ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం ఎన్ బీరెన్ సింగ్ పై ఆరోపణలు చేసినట్టు తెలుస్తున్నది.

Also Read: యూనిఫాం సివిల్ కోడ్ పై బీఎస్పీ వైఖరి ఏమిటీ? మాయావతి ఏమంటున్నారు?

మయన్మార్‌లో మైతేయీ వర్గం ప్రజలు కూడా భారీగా నివసిస్తున్నారని మరో యూజర్ సోషల్ మీడియాలో పేర్కొనగా.. వారు ప్రత్యేక ప్రాంతం అడగట్లేదని పరుషంగా సీఎం బీరెన్ సింగ్ సమాధానం ఇచ్చారు. మరొక యూజర్.. తాను కుకీలు డిమాండ్ చేస్తున్న జలెంగమ్ ప్రత్యేక రాష్ట్ర పౌరుడిని అంటూ పేర్కొనగా.. అయితే నీవు మయన్మార్‌లో ఉండొచ్చు అంటూ ఎన్ బీరెన్ సింగ్ సమాధానం ఇచ్చారు. సీఎం ఎన్ బీరెన్ సింగ్ సమాధానాల రూపంలో పోస్టు చేసిన ఈ ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి.