యూనిఫాం సివిల్ కోడ్ పై బీఎస్పీ వైఖరి ఏమిటీ? మాయావతి ఏమంటున్నారు?
యూనిఫాం సివిల్ కోడ్ పై దేశవ్యాప్తంగా చర్చ రేగింది. దీనిపై తాజాగా బీఎస్పీ స్పందించింది. ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకం కాదని, కానీ బీజేపీ అమలు చేయదలుచుకున్న విధానానికి మాత్రమే తాము వ్యతిరేకం అని వివరించారు.
న్యూఢిల్లీ: గతవారం ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యాఖ్యలపై స్పందించాయి. త్వరలో జరగబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడిస్తున్నాయి. ఈ సందర్భంలోనే కొంతకాలంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ పార్టీ వైఖరి ఏమిటనే ప్రశ్నలు వచ్చాయి. వీటికి బీఎస్పీ చీఫ్ మాయావతి తాజాగా వివరణ ఇచ్చారు.
తాము యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకం కాదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి స్పష్టం చేశారు. ఈ సివిల్ కోడ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరే సరిగా లేదని ఆమె ఆరోపించారు. దీని ఆధారంగా మందిని రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదని ఆమె తెలిపారు. దీని ముసుగులో దేశంలో రాజకీయాలకు పాల్పడటం సరికాదని చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగం సూచిస్తున్నప్పటికీ దాన్ని తప్పకుండా విధించాలనే రూలేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
Also Read: ''వారి వ్యక్తిగతం.. అజిత్ పవార్ వర్గానికి ఎన్సీపీ మద్దతు లేదు..''
ఉమ్మడి పౌరస్మృతిని ఏకాభిప్రాయంతో మాత్రమే అమలు చేయాలని సూచించారు. కానీ, ఇప్పుడు దీనిపై ఏకాభిప్రాయం లేదని, దీని ముసుగులో సంకుచిత రాజకీయాలకు పాల్పడటం దేశానికే ఏమాత్రం ప్రయోజనకరం కాదని వివరించారు. తాము ఈ యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకం కాదని, కానీ, బీజేపీ దాన్ని అమలు చేయాలనుకుంటున్న విధానానికి మాత్రమే వ్యతిరేకం అని వివరించారు.