మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లడంతో 12 ప్రాణాలు కోల్పోయారు.
Mandsaur : మధ్యప్రదేశ్‌లోని మండసౌర్ జిల్లాలోని నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 14 మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బావిలో పడి 12 మంది మరణించారు... మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ దారుణ ఘటన జరిగింది. వేగంగా వెళుతున్న వ్యాన్ ఓ బైక్ ను ఢీకొట్టి అదుపుతప్పింది... దీంతో బైక్ తో సహా పాడుబడిన బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైకర్ సహా వ్యానులోని వారు ప్రాణాలు కోల్పోయారు.
మండసౌర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) అభిషేక్ ఆనంద్ ఈ దుర్ఘటన వివరాలను వెల్లడించారు. "నారాయణగఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగిన ఘటనలో ఒక వ్యాన్ బావిలో పడిపోయింది... ఈ సమయంలో వ్యాన్‌లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిని కాపాడేందుకు బావిలోకి దిగిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్ మొదట ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది... రైడర్ కూడా మరణించాడు" అని తెలిపారు. బావిలో పడినవారిలో కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో బైటపడ్డారు.
"అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. కొన్ని పోస్ట్‌మార్టంలు ఇప్పటికే పూర్తయ్యాయి. కేసుకు సంబంధించిన చట్టపరమైన చర్యలను కూడా చేపట్టాం" అని ఎస్పీ తెలిపారు.
బావిలోపడినవారికి కాపాడేందుకు స్థానిక గ్రామస్థుడు మనోహర్ రెస్క్యూ చేయడానికి బావిలోకి దిగాడు. అతను ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురిని కాపాడాడు, కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రక్రియలో తన ప్రాణాలను కోల్పోయాడు. అతని మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
"ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన, మేము బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము" అని ఎస్పీ ఆనంద్ అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని మండసౌర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది బాధితుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఎక్స్ లో ఈ ఎక్స్ గ్రేషియా ప్రకటన చేసింది. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా మండసౌర్ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరియు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
