భార్య తనపై గృహహింస కేసు పెట్టడంతో విచారణ కోసం వచ్చిన మహిళా అధికారిపై తన కుక్కను వదిలాడో వ్యక్తి. కేరళలోని వయనాడ్ జిల్లా మేపద్దిలో ఈ ఘటన జరిగింది.  

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన వీధి కుక్కల దాడులు, ఆయా ఘటనల్లో మరణించిన లేదా గాయపడిన వారి గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో కుక్కలను చూస్తే చాలు జనం పారిపోతున్నారు. వీధుల వెంట నడవాలంటేనే జనం వణుకుతున్నారు. వీధి కుక్కల సంగతి ఇలా వుంటే కొందరు వ్యక్తులే తమ పెంపుడు కుక్కలను జనం మీదకు వదులుతున్నారు. మొన్నామధ్య హైదరాబాద్ ఓ సీఐ అపార్ట్‌మెంట్ వాసుల మీదకు కుక్కలను ఉసిగొల్పిన ఘటన కలకలం రేపింది. తాజాగా కేరళలో దారుణం జరగింది. భార్య తనపై గృహహింస కేసు పెట్టడంతో విచారణ కోసం వచ్చిన మహిళా అధికారిపై తన కుక్కను వదిలాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. వయనాడ్ జిల్లా మేపద్దికి చెందిన ఓ వివాహిత తన భర్తపై గృహహింస కేసు పెట్టింది. దీంతో విచారణ నిమిత్తం ఓ మహిళా అధికారి బాధితురాలి ఇంటికి వచ్చారు. 

దీంతో సదరు వివాహిత భర్త.. అధికారిపైకి కుక్కను వదలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ భర్తను అరెస్ట్ చేసి, మహిళా అధికారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మరోవైపు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసుపై కేరళ మంత్రి వీణా జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన చర్య అని.. మహిళా అధికారి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారని, ఆమెతో తాను మాట్లాడినట్లు తెలిపారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్న అధికారులపై కుక్కలతో దాడి చేయడం దారుణమని వీణ జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 

Also Read: జనంపైకి కుక్కల్ని వదిలి.. తమాషా : ఎల్బీనగర్‌లో సీఐ పైశాచికత్వం, హడలిపోతోన్న అపార్ట్‌మెంట్‌వాసులు

కాగా.. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని చిత్రా లేఔట్‌లో దారుణం జరిగింది. అక్కడి మంజీరా హైట్స్ డీ బ్లాక్‌లో నివసిస్తున్న ఓ సీఐ అపార్ట్‌మెంట్‌వాసులపై కుక్కలను వదులుతున్నాడు. కుక్కల భయంతో కాలనీవాసులు వణికిపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తనదైన శైలిలో బెదిరిస్తున్నాడు. గత వారం ఓ మహిళా గైనకాలజిస్ట్ పైకి రెండు పెంపుడు కుక్కల్ని వదిలాడు సీఐ . ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్బీ నగర్ పోలీసులు సీఐపై కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో సీఐ కుక్కల్ని వదిలిన వీడియోలు, బెదిరింపులకు పాల్పడిన వీడియోలు రికార్డ్ అయ్యాయి.