మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిపై పసుపు దాడి.. డిమాండ్లు నెరవేర్చకపోతే నల్లరంగు... ముఖ్యమంత్రికి హెచ్చరిక...
మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిపై పసుపు చల్లాడో వ్యక్తి. ధన్‌గర్ (గొర్రెల కాపరి) కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలోకి తేవాలని వారు డిమాండ్ చేశారు.

ముంబయి : మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ పై పసుపుతో దాడి చేశాడో వ్యక్తి. రిజర్వేషన్ల డిమాండ్ మీద ఈ రోజు సమావేశం అయిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన వీడియోలో ధన్‌గర్ (గొర్రెల కాపరి) కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మంత్రికి ఇరువైపులా నిలబడి ఉన్నారు.
మంత్రి వారు ఇచ్చిన లేఖను చదువుతుండగా, వారిలో ఒకరు అకస్మాత్తుగా జేబులో నుండి పసుపు పొడిని తీసి మంత్రి తల మీద పోశాడు. వెంటనే అప్రమత్తమైన పాటిల్ సహాయకులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. నేలమీద లేవకుండా అదిమిపట్టారు. అతను మరాఠీలో రిజర్వేషన్ సమస్య గురించి గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు.
రావణుడి వల్లే కాలేదు.. వీళ్లెంతా?: సనాతన ధర్మంపై యోగి ఆదిత్యానాథ్
భద్రతాసిబ్బంది అతనిని తన్నడం, కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. షోలాపూర్ జిల్లాలోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానని శేఖర్ బంగాలే అనే ఆ వ్యక్తి మీడియాతో చెప్పాడు.
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీ కిందకి ధన్‌గర్ కమ్యూనిటీని తేవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపాడాయన. ఈ డిమాండ్ త్వరగా నెరవేర్చకుంటే ముఖ్యమంత్రి లేదా ఇతర రాష్ట్ర మంత్రులపై కూడా నల్ల రంగు వేస్తామని హెచ్చరించారు. పసుపు పొడిని మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారని, దానిని పవిత్రంగా పరిగణిస్తారని దానిని తప్పుగా భావించడం లేదని రాధాకృష్ణ విఖే పాటిల్ అన్నారు.
ఇది సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు.
నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని తాను కోరలేదని ఆయన తెలిపారు. తన పార్టీ కార్యకర్తలు అతడిని ఎందుకు కొట్టారో, ఏం జరిగిందో ఆ క్షణంలో ఎవరికీ అర్థం కాలేదని, అందుకే ఇది సహజమైన ప్రతిచర్య అని పాటిల్ అన్నారు. ఆ వ్యక్తి వెంట పడొద్దని, వదిలేయాలని పార్టీ కార్యకర్తలను కోరినట్లు చెప్పారు.
రాజకీయంగా ఆధిపత్యం ఉన్న వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రిజర్వేషన్‌ను గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత మహారాష్ట్రలో ఇటీవల మరాఠా కమ్యూనిటీ సభ్యులు దూకుడుగా నిరసనలు చేపట్టారు.