రావణుడి వల్లే కాలేదు.. వీళ్లెంతా?: సనాతన ధర్మంపై యోగి ఆదిత్యానాథ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సనాతన ధర్మంపై వివాదంపై స్పందించారు. రావణుడి వల్లే సనాతన ధర్మం అంతం కాలేదని అన్నారు. కంసుడి హూంకారం వల్లేనూ అంతరించిపోలేదని వివరించారు. అలాంటిది.. అధికారం కోసం వెంపర్లాడే ఇలాంటి పరాన్నజీవుల వల్ల అంతరించి పోతుందా? అని అన్నారు.

న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, రాష్ట్రమంత్రి, డీఎంకే లీడర్ ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కొందరు సనాతన ధర్మాన్ని సమర్థిస్తూ వస్తుండగా.. మరికొందరు ఉదయనిధికి అండగా నిలబడుతున్నారు. ఈ సందర్భంలో హిందుత్వ ఫైర్ బ్రాండ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.
తాజాగా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందిస్తూ.. సనాతన ధర్మం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తున్నదని తెలిపారు. ఇకపైనా అలాగే కొనసాగుతుందని అన్నారు. రావణుడి అహంకారం ఈ సనాతన ధర్మాన్ని అంతం చేయలేకపోయిందని, కంసుడి హూంకారానికీ చలించలేదని ఆయన అన్నారు. ముగల్ చక్రవర్తులు బాబర్, ఔరంగజేబుల దారుణాలకూ సనాతన ధర్మం అంతరించిపోలేదని వివరించారు. అంతటి సనాతన ధర్మం ఇలాంటి అధికారం కోసం పాకులాడే పరాన్నజీవుల వల్ల ఎలా అంతం అవుతుంది? అని అన్నారు.
సనాతన ధర్మం అనేది సూర్యుడి వలే ప్రకాశవంతమైనదని సీఎం యోగి పోల్చారు. సూర్యుడి పై ఉమ్మాలని అనుకుంటే.. అది సూర్యుడిపై పడదని, తిరిగి అది ఉమ్మిన వారి ముఖంపైనే పడుతుందని యోగి అన్నారు. సనాతన ధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని భావి తరాలు చరిత్రహీనులుగా గుర్తు పెట్టుకుంటాయని పేర్కొన్నారు.
Also Read : మహిళ మృత దేహం లభ్యం.. పోస్టు మార్టంలో పురుషుడి మృత దేహంగా.. అందరూ షాక్.. ఏమైందంటే?
సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ వంటిదని, దాన్ని వ్యతిరేకించకూడదని, మొత్తంగానే నిర్మూలించేయాలని ఓ కవుల సమావేశంలో ఉదయనిధి కామెంట్ చేశారు. సనాతన ధర్మం అసమానతలకు మూలం అని, ప్రజలంతా సమానంగా ఉండాలంటే దాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించా లనే పదాన్ని బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాలవీయా.. హిందువుల మారణ హోమానికి పిలుపు ఇచ్చాడని మరో అర్థం ఇచ్చారు. తాను హిందువుల ఊచకోత కు పిలుపు ఇవ్వలేదని, తాను కేవలం సనాతన ధర్మం అనే భావజాలాన్ని నిర్మూలించాలని అన్నానని ఉదయనిధి వివరణ ఇచ్చారు.