దేవుడు కోరిన కోరిక తీర్చలేదని..ఏకంగా లింగాన్నే ఎత్తుకెళ్లాడు.. ఇంతకీ అతనేం కోరుకున్నాడంటే...
తన కోరిక శివుడు తీర్చలేదని కోపంతో విచిత్రమైన పని చేశాడో యువకుడు. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఉత్తర ప్రదేశ్ : రోజూ ఎంతో భక్తితో పూజలు చేసినా తన కోరిక తీర్చలేదని ఓ భక్తుడు చేసిన పని ఉత్తర ప్రదేశ్ లో భక్తుల్ని అవాక్కయ్యేలా చేసింది. పవిత్ర మాసమైన శ్రావణమాసంలో రోజూ నిత్యం గుడికి వస్తూ.. శివుడికి భక్తితో అర్చనలు చేసిన ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఓ శివాలయంలోని శివలింగం తెల్లారేసరికి కనిపించకుండా పోయింది. ఆరా తీసిన భక్తులకి… ఆ శివలింగాన్ని ఎత్తుకెళ్లింది.. రోజు నిష్ఠతో ఉదయం సాయంత్రం పూజలు చేసే ఓ యువకుడు అని తెలిసింది.
ఇంతకీ ఆ యువకుడు శివలింగాన్ని ఎందుకు ఎత్తుకెళ్లాడు అని ఆరా తీయగా.. అతను చెప్పిన సమాధానం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటంటే… ఉత్తర ప్రదేశ్ లోని కౌశంబి జిల్లా మహెవా ఘాట్ ప్రాంతంలో ఛోటూ అనే 27 ఏళ్ల యువకుడు ఉన్నాడు.. అతను తన బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే.. ఆమెను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా కోరుకున్నాడు.
నా వ్యాఖ్యలను కాషాయ శిబిరం వక్రీకరించింది - బీజేపీపై ఉదయనిధి స్టాలిన్ ఫైర్.. తాజా లేఖ విడుదల
తన కోరిక నెరవేయడం కోసం శివుడి ఆశీర్వాదం కావాలనుకున్నాడు. భక్త సులభుడైన శివుడిని భక్తితో ఆరాధిస్తే తన కోరిక నెరవేరుతుందని గట్టిగా నమ్మాడు. తాను ప్రేమించిన యువతిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని శివుడి ముందే ప్రతిజ్ఞ కూడా చేశాడు. ఇక ఆ రోజు నుంచి… నిత్యం ఉదయం, సాయంత్రం శివాలయానికి వెళ్లడం.. భక్తిశ్రద్ధలతో, ఆచార వ్యవహారాలతో పూజించడం మొదలుపెట్టాడు.
అతని భక్తి, నిష్ట చూసిన మిగతా భక్తులు ఎంతో ఆశ్చర్యపోయారు. నేటి కాలంలో కూడా ఇలాంటి భక్తి యువతలో కనిపించడం చాలా అరుదు అంటూ మెచ్చుకునేవారు. అలా రోజులు గడిచిపోయాయి.. ఓ రోజు శివాలయానికి వచ్చిన భక్తులకు గుడిలో శివలింగం కనిపించలేదు. మిగతావన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఇది ఎవరి పనో అర్థం కాక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గుడికి వచ్చే వారి గురించి వివరాలు తీసుకున్నారు. అందరిలో ఛోటూ మీద వారికి అనుమానాలు వచ్చాయి. ఇక నిత్యం క్రమం తప్పకుండా పూజ కోసం గుడికి వచ్చే ఛోటూ.. ఆరోజు గుడికి రాకపోవడం కూడా వారి అనుమానాన్ని మరింత పెంచింది. తర్వాత ఛోటూను ప్రశ్నించగా.. శివలింగాన్ని తానే ఎత్తుకెళ్లినట్లుగా ఒప్పుకున్నాడు.
మొదట.. బంగారమో, గుప్తనిధుల కోసమో ఎత్తుకెళ్లి ఉంటాడని అనుమానించారు. కానీ ఛోటూ చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని… ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుని.. ఆ కోరికతోనే శివుడిని భక్తిశ్రద్ధలతో పూజించానని తెలిపాడు. కానీ.. ఎంతో నమ్మిన శివుడు తన కోరిక తీర్చలేదని.. ఆ యువతి తనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అందుకే.. శివుడి మీద కోపంతో శివలింగాన్ని ఎత్తుకెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. దీంతో కాసేపు పోలీసుల నోట మాట రాలేదు. ఆ తర్వాత అతడిది అమాయకత్వమో, మూర్ఖత్వమో అర్థం కాక.. పోలీసులు ఏం చేయాలో తెలియక.. జుట్టు పీక్కున్నారు. ఛోటూను.. గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లినందుకు అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న శివలింగాన్ని గుడిలో ప్రతిష్టించారు.