సారాంశం

తాను చేసిన వ్యాఖ్యలను కాషాయ శిబిరం వక్రీకరించిందని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తన ప్రసంగాన్ని బీజేపీ మారణహోమాన్ని ప్రేరేపించేలా వక్రీకరించిందని ఆరోపించారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలియాతో పోల్చి, దాన్ని నిర్మూలించాలని చెప్పిన వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి ఆయనపై బీజేపీతో పాటు పలు వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. 

అయితే ఈ విమర్శలు, కేసులపై ఉదయనిధి స్టాలిన్ తాజాగా స్పందించారు. తన వ్యాఖ్యలను కాషాయ శిబిరంవక్రీకరించిందని ఆరోపిస్తూ తాజాగా వివరణ ఇచ్చారు. తనపై నమోదైన అన్ని కేసులను చట్టబద్దంగా ఎదుర్కొంటానని పేర్కొంటూ ఆయన ఓ లేఖ విడుదల చేశారు. దానిని తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు చేశారు. ఆ లేఖలో ‘‘నా ప్రసంగాన్ని బీజేపీ మారణహోమాన్ని ప్రేరేపించేలా వక్రీకరించింది. తమను తాము రక్షించుకోవడానికి దీన్ని ఆయుధంగా భావిస్తారు. డీఎంకే వ్యవస్థాపకుడు పేరరింజర్ అన్నా రాజకీయ వారసుల్లో నేనూ ఒకడిని. మేము ఏ మతానికి శత్రువులం కాదని అందరికీ తెలుసు. అన్ని జీవితాలు సమానంగా పుడతాయని బోధించే అన్ని మతాలను మేము గౌరవిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. 

గత తొమ్మిదేళ్లుగా మోడీ చేసిందేమీ లేదని ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. ‘‘అప్పుడప్పుడు డబ్బు దాచుకోవడం, గుడిసెలు కనిపించకుండా ఉండేందుకు గోడలు కట్టడం, కొత్త పార్లమెంటరీ భవనం నిర్మించడం, అక్కడ సెంగోల్ ప్రతిష్టించడం, దేశం పేరు మార్చడం, సరిహద్దులో నిలబడి తెల్ల జెండా పని చేయించడం వంటివి చేస్తుంటాడు.’’ అని విమర్శించారు.

ప్రజాసేవలన్నీ తమ నోటితో చేస్తే సరిపోతుందని భావించే కొందరు మీడియాను కలిసి తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. ‘‘ మణిపూర్ లో జరిగిన అల్లర్లలో 250 మందికి పైగా మరణించడం, కాగ్ నివేదికలో పేర్కొన్న రూ.7.5 లక్షల కోట్ల అవినీతి సహా వాస్తవాల నుంచి దృష్టి మరల్చేందుకు మోదీ అండ్ కో సనాతన వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. వారి బాణీలకు అనుగుణంగా ఈపీఎస్ డ్యాన్స్ చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

‘‘ఈ రోజు మఠాధిపతులకే చాలా పబ్లిసిటీ అవసరం. అలాంటి ఓ సాధువు రంగంలోకి దిగి రూ.10 కోట్ల ధరను నా నెత్తిన వేశాడు. అన్నీ వదులుకున్నానని చెప్పుకునే వ్యక్తికి రూ.10 కోట్లు ఎలా వస్తాయనేది నా నెత్తిన వేసిన ధర కంటే నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాకుండా చాలా మంది నాపై దేశంలోని వివిధ పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో ఫిర్యాదులు చేస్తున్నారు’’ అని అన్నారు.

కాగా.. తనపై హత్యా బెదిరిపులు చేసిన పీఠాధిపతిపై తమ పార్టీ సభ్యులు వివిధ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులు చేయడం, ఆయన దిష్టిబొమ్మలు, చిత్రాలను దహనం చేయడం, ఆయనను ఖండిస్తూ పోస్టర్లు అతికిస్తున్నారని తెలిసిందని చెప్పారు. అలా చేయవద్దని సూచించారు. ‘‘ఇతరులకు హుందాతనాన్ని బోధించేది మనమే. అదే మన నాయకులు మనకు నేర్పారు. కాబట్టి ఇలాంటి వాటిని పూర్తిగా మానుకోవాలని మా ఉద్యమ కామ్రేడ్లను కోరుతున్నాను. ’’ అని పేర్కొన్నారు.