ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో దారుణం జరిగింది. ఓ వృద్ధుడిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో ఐదేళ్ల బాలుడు వీధి కుక్కల చేతిలో బలైన ఘటన తర్వాత దేశవ్యాప్తంగా కుక్కల దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో నిత్యం వీధి కుక్కల దాడిలో ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా.. వందల మంది గాయపడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో ఓ వృద్ధుడిపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. క్యాంపస్‌లోని పార్క్‌లో 65 ఏళ్ల డాక్టర్ సఫ్దర్ అలీ ఆదివారం ఉదయం వాకింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మృతదేహం క్యాంపస్‌లో రక్తపు మడుగులో పడివున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతమంతా పరిశీలించారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. బాధితుడిపై పది కుక్కుల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పదే పదే దాడి చేయడంతో పాటు నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలతో సఫ్దర్ అలీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం అలీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో తిరిగేందుకు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: కుక్కల దాడిలో మామిడి రైతు మృతి.. తోటకు కాపాలాగా వెడితే కరిచి చంపాయి...
కాగా.. ఈ నెల ప్రారంభంలో ఏపీలోని అన్నమయ్య జిల్లాసంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ ముద్దినేని వడ్డెపల్లెలో కుక్కుల దాడిలో ఓ రైతు మరణించడం సంచలనం సృష్టించింది. మదనపల్లె రెడ్డయ్య (55) ముద్దినేనివడ్డెపల్లెకు చెందిన రైతు. అతనికి గ్రామ సమీపంలో మామిడి తోట ఉంది. ఈ క్రమంలో రాత్రి తోటకు కాపలా ఉండడానికి వెళ్లాడు. తోట గట్టున పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతడి మీద కుక్కల గుంపు దాడి చేసింది.
వాటినుంచి తప్పించుకోలేక.. ఆ రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన తర్వాతి రోజు ఉదయానికి గానీ వెలుగులోకి రాలేదు. సమీప పొలాల్లోని రైతులు రెడ్డయ్య చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తోటకు చేరుకున్న వారు అక్కడ బీభత్సంగా ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
