కుక్కల దాడిలో ఓ రైతు మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. మామిడి తోటకు కాపలాగా వెళ్లిన రైతుమీద కుక్కలు దాడి చేసి చంపేశాయి.
అన్నమయ్య జిల్లా : తెలుగు రాష్ట్రాల్లో శునకాల బెడద ఇంకా తీరడం లేదు. మనుషులమీద దాడిచేస్తూ వీధి కుక్కలు గాయపరుస్తున్న ఘటనలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. సిద్ధిపేట అదనపు కలెక్టర్ ను కుక్కలు కరిచిన ఘటన నిన్న సంచలనంగా మారింది. ఇదింకా మరువకముందే ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కుక్కల దాడిలో ఓ రైతు మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ ముద్దినేని వడ్డెపల్లెలో సోమవారం రాత్రి జరిగింది.
స్థానికులు, పోలీసులు ఈ ఘటనకు సంబంధించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె రెడ్డయ్య (55) ముద్దినేనివడ్డెపల్లెకు చెందిన రైతు. అతనికి గ్రామ సమీపంలో మామిడి తోట ఉంది. సోమవారం రాత్రి తోటకు కాపలా ఉండడానికి వెళ్లాడు. తోట గట్టున పడుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతడి మీద కుక్కల గుంపు దాడి చేసింది. వాటినుంచి తప్పించుకోలేక.. ఆ రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం ఉదయానికి గానీ వెలుగులోకి రాలేదు.
విషాదాంతం : ఊయలలోనుంచి అదృశ్యమై.. కాలువలో శవమై తేలిన యేడాదిన్నర చిన్నారి..
మంగళవారం ఉదయం సమీప పొలాల్లోని రైతులు రెడ్డయ్య చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తోటకు చేరుకున్న వారు అక్కడ బీభత్సంగా ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న రాయచోటి గ్రామీణ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని సిద్దిపేట కలెక్టరేట్లో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి కుక్క కాటుకు గురయ్యారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా కుక్కలు తీవ్రంగా కరిచాయి. కలెక్టర్ పెంపుడు కుక్కను కూడా వీధికుక్కలు కరిగి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట కలెక్టరేట్ నగర శివారులలో ఉంది. అక్కడ కలెక్టరేట్ తో పాటు అధికారుల నివాసాలు కూడా ఉన్నాయి.
ఆ నివాసాల్లోనే అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉంటున్నారు. శనివారం రాత్రి ఆయన తాముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ వీధి కుక్క అతడిని గట్టిగా కరిచింది. దీంతో శ్రీనివాసరెడ్డి రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం తీవ్రంగా అయ్యింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుక్కని తరిమికొట్టి ఆయనని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డి ఐసియూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.
అదనపు కలెక్టర్ ను కుక్క కరిచిన అదే రోజు రాత్రి మరో వీధి కుక్క కలెక్టర్ పెంపుడు కుక్కను కూడా కరిచింది. దాంతోపాటు కలెక్టరేట్ సమీపంలోని ఒక పౌల్ట్రీ ఫార్మ్ వద్ద మరో బాలుడిని కూడా కుక్కలు కరిచాయి. ఈ ఘటనను వరుసగా వెంట వెంటనే జరగడంతో.. కలెక్టరేట్ సమీపంలో నివసిస్తున్న అధికారుల కుటుంబాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. అధికారులకే భద్రత లేకపోతే మా పరిస్థితి ఏంటి అని సామాన్య ప్రజలు వాపోతున్నారు.
