కస్టడీలోని నిందితుడు పోలీసు కారుతో పరార్.. కొద్ది దూరం తర్వాత కారు వదిలాడు.. కానీ!
హర్యానాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పోలీసు వెహికిల్‌తో పారిపోయాడు. కారు కీని దానికే ఉంచి పోలీసులు అందరూ కిందికి దిగారు. కారులోనే ఉన్న నిందితుడు పారిపోయాడు. పది కిలోమీటర్ల దూరంలో కారును వదిలిపెట్టాడు.
న్యూఢిల్లీ: హర్యానాలో ఓ నిందితుడు పోలీసుల కారుతో పరార్ అయ్యాడు. పది కిలోమీటర్ల దూరంలో కారును వదిలిపెట్టాడు. కానీ, అందులో కారు కీ ఉంచలేదు. కారును గుర్తించిన పోలీసులు కీ లేక తలలు పట్టుకున్నారు. చుట్టు పక్కల ఉండే పొదల్లో తాళం చెవుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్‌లో చోటుచేసుకుంది.
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కన్వల్జీత్ సింగ్ మాట్లాడుతూ.. వారికి ఓ గొడవ గురించి సమాచారం అందిందని, అక్కడికి(కుర్ది గ్రామానికి) వెళ్లడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్‌లో బయల్దేరామని వివరించారు. కుర్దీ గ్రామానికి వెళ్లే దారి మధ్యలో కొందరు రోడ్డుపైనే గొడవ పడుతూ కనిపించారు. దీంతో పోలీసులు కారులో నుంచి కిందికి దిగి వారిని అడ్డుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కారులో ఎక్కించుకున్నారు. మళ్లీ కుర్దీ గ్రామానికి ప్రయాణం కొనసాగించారు.
ఫోన్ వచ్చిన కుర్ది గ్రామానికి వెళ్లిన తర్వాత ఓ ఇంటిలోకి వెళ్లి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కారులో కీ అలాగే ఉంచి పోలీసులు కారు దిగి ఆ ఇంటిలోకి వెళ్లారు. కాగా, అంతకు ముందు అదుపులోకి తీసుకున్న నిందితుడిని కారులోనే ఉంచారు. ఆ నిందితుడు దాన్ని అదునుగా తీసుకుని కారును ముందుకు తీసుకెళ్లాడు. పోలీసులకు వెంటనే సమాచారం అందింది.
బయటికి వచ్చి చూడగా కారు లేదు. దీంతో ఓ బైక్‌ను తీసుకుని కారు కోసం చేజ్ చేశారు. సుమారు పది కిలోమీటర్ల తర్వాత ఆ నిందితుడు పోలీసు కారును వదిలిపెట్టి పారిపోయాడు. అయితే, ఆ కారులో మాత్రం కీ లేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. చుట్టూ ఉన్న జంగల్‌లో కారు తాళం చెవుల కోసం వెతికారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.