101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూత.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన సీఎం
నారీ శక్తి అవార్డు గ్రహీత, 2019లో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్ కార్త్యాయని అమ్మ మరణించారు. ఆమె కేరళలో అత్యంత వృద్ధ విద్యార్థినిగా గుర్తింపు పొందారు. కార్తాయని అమ్మ మరణం పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేరళలో అత్యంత వృద్ధ విద్యార్థినిగా గుర్తింపు పొందిన కార్త్యాయని అమ్మ కన్నుమూశారు. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ప్రతిష్ఠాత్మక వయోజన అక్షరాస్యత కార్యక్రమంలో ఆమె తన 96 ఏళ్ల వయసులో ప్రథమ ర్యాంకు సాధించారు. అయితే ఏడాదిగా ఆమె పక్షపాతం వల్ల మంచానికే పరిమితమయ్యారు. అయితే చనిపోయే నాటికి ఆమె వయస్సు 101 ఏళ్లు.
ఆమె నాలుగో తరగతి తత్సమాన పరీక్ష అయిన 'అక్షరలక్షం' పరీక్షలో అత్యధిక మార్కులు సాధించారు.ఈ పరీక్ష రాసిన 43,330 మందిలో ఆమె అత్యంత వృద్ధురాలు. దీంతో ఆమెకు నారీ శక్తి అవార్డు కూడా వరించింది. ఈ అవార్డును కార్త్యాయని అమ్మ ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. 2019లో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.
కాగా.. ఆమె మరణం పట్ల సీఎం పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ కింద అత్యంత వృద్ధురాలిగా చరిత్ర సృష్టించిన కార్త్యాయని అమ్మ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. సవాళ్లు ఎదురైనా విద్యను అభ్యసించాలనే అచంచల సంకల్పాన్ని ప్రదర్శిస్తూ ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. ‘ఆమె మరణం ఆధునిక కేరళను రూపొందించడంలో సహాయపడిన మన అక్షరాస్యత ఉద్యమానికి గణనీయమైన లోటు. ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని సీఎం ‘ఎక్స్’ (ట్విట్టర్) పోస్టులో పేర్కొన్నారు.
కార్త్యాయని అమ్మ మృతి పట్ల రాష్ట్ర సాధారణ విద్యాశాఖ మంత్రి వి.శివన్ కుట్టి సంతాపం తెలిపారు. చదువుకోలేని పరిస్థితుల్లో పెరిగి 96 ఏళ్ల వయసులో అక్షరాస్యురాలిగా ఎదిగిన అమ్మ దృఢ సంకల్పానికి ప్రతీక అని మంత్రి కొనియాడారు. ఇదిలా ఉండగా.. కేరళలోని హరిపాడ్ మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు పిల్లల వితంతు తల్లి కార్త్యాయని అమ్మ,, తన గ్రామంలోని దేవాలయాల సమీపంలో వీధులు ఊడ్చి కుటుంబాన్ని పోషించేవారు.