న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసనకు దిగినవారిపై కాల్పులకు తెగబడిన టీనేజ్ షూటర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. జామియా మిలియా విశ్వవిద్యాలయంలోని నిరసనకారులపై 17 ఏళ్ల కుర్రాడు కాల్పులు జరిపిన ఘటనలో ఓ విద్యార్థి గాయపడిన విషయం తెలిసిందే. 

ఉత్తరప్రదేశ్ లోని జీవార్ ప్రాంతానికి చెందిన ఆ కుర్రాడు తన గ్రామ సమీపంలోని డీలర్ నుంచి పది వేల రూపాయలకు గన్ కొన్నట్లు తెలిసింది. గురువారం జరిగే తన సోదరుడి (కజిన్) వివాహంలో కాల్పులు జరపడానికని అబద్ధం చెప్పి అనతు తుపాకీని కొన్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారం రంగులో ఉన్న సింగిల్ షాట్ తుపాకీతో పాటు రెండు బుల్లెట్లను కూడా అతను డీలర్ నుంచి పొందినట్లు తెలుస్తోంది. వాడకుండా మిగిలిన ఓ బులెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: ఫేస్ బుక్ లైవ్ మూమెంట్స్: జామియా షూటర్ రామభక్త్ గోపాల్

బాలుడికి తుపాకీని అమ్మిన డీలర్ ను గుర్తించామని, వ్యాపారిని పరిచయం చేసిన నిందితుడి మిత్రుడిని కూడా కనిపెట్టామని, వారి కోసం తమ బృందాలు గాలిస్తున్నాయని అధికారులు చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కూడా తెలిపారు. అయితే ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని చెప్పారు. 

నిందితుడిని 14 రోజుల ప్రివెంటివ్ కస్టడీకి పంపించారు. పదో తరగతి మార్కు సీట్, ఆధార్ కార్డు ప్రకారం నిందితుడు మైనర్ అని తెలుస్తోందని చెప్పారు. అతని వయస్సును నిర్ధారించడానికి ఓసిఫికేషన్ టెస్టు చేస్తామని, అనుమతి పొందిన తర్వాత వయస్సు నిర్ధారించడానికి ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

టీనేజ్ షూటర్ తనంత తానుగా తీవ్రమైన భావాలను సంపాదించుకున్నాడని, సోషల్ మీడియాలో అతివాద పోస్టులను చదివేవాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెబుతున్నారు. 2019 నవంబర్ లో జీవార్ లో భజరంగ్ దళ్ నిర్వహించిన కార్యక్రమానికి అతను హాజరయ్యాడు.

Also Read: జామియా షూటర్: స్కూల్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి....

తనంత తానుగానే జామియా విశ్వవిద్యాలయానికి వెళ్లానని, తనను ఎవరూ ప్రేరేపించలేదని అతను ప్రాథమిక విచారణ తెలిపాడు. గత పక్షం రోజులుగా అతను వింతగా ప్రవర్తిస్తూ వచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంట్లోనూ, పరిసరాల్లోనూ నినాదాలు చేసేవాడని అంటున్నారు. 

సీఏఏకు అనుకూలంగా అతను మిత్రులను పోగుచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని తెలుస్తోంది. గన్ పేల్చడంలో తనకు అనుభవం లేదని కూడా అతను చెప్పినట్లు సమాచారం. కుర్రాడి కాల్పుల్లో గాయపడిన విద్యార్థి షాబాద్ ఫరూక్ అస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు.

కాలేజీకి వెళ్తున్నానని చెప్పిన నిందితుడు కాలేజీకి వెళ్లకుండా బస్సులో ఢిల్లీకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆటోలో జామియా మిలియా విశ్వవిద్యాలయానికి వెళ్లాడు.