న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై కాల్పులు జరిపిన యువకుడు తాను బడికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పాడు. అతని 17 ఏళ్ల స్కూల్ బాయ్ గా గుర్తించారు. పాఠశాలకు వెళ్తున్నానని గురువారం ఉదయం చెప్పి జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. 

అతను బడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఓ వివాహానికి హాజరు కావాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలని జేవార్ లో గల పాఠశాలకు వెళ్లడానికి బదులు బ్లాక్ జాకెట్ ను ధరించి, దాంట్లో గన్ ను దాచుకుని అక్కడికి వెళ్లాడు. 

Also Read: జామియా కాల్పులు: అమిత్ షా స్పందన ఇదీ, కేజ్రీవాల్ ఇలా...

నిరసనకారుల వద్ద అటూ ఇటూ తిరుగుతూ కేకలు వేస్తూ అకస్మాత్తుగా పిస్టల్ తీసి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మాస్ కమ్యూనికేషన్ విద్యార్థి షాదాబ్ ఫరూక్ గాయపడ్డాడు. పోలీసులు పట్టుకోవడానికి ముందు అతను నిరసనకారుల వైపు గన్ ఎక్కుపెట్టి, హెచ్చరిస్తూ వచ్చాడు. 

నిరసనకారులపై కాల్పులు జరిపాడని తెలిసి యువకుడి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 11వ తరగతి చదువుతున్న అతను అసాధారణంగా ప్రవర్తిస్తూ వచ్చాడని, గత నాలుగు రోజులుగా వింతగా మాట్లాడుతూ వచ్చాడని అతని కుటుంబ సభ్యుడొకరు చెప్పారు.

Also Read: ఫేస్ బుక్ లైవ్ మూమెంట్స్: జామియా షూటర్ రామభక్త్ గోపాల్

అతనికి రాజకీయ సంబంధాలేమీ లేవని, అతి మామూలుగా ఉంటాడని అతని మిత్రులు చెప్పారు. అయితే, అతని ఫేస్ బుక్ పోజీని చూస్తే ఈ మాటల్లో నిజం లేదని అర్థమవుతుంది. అతని ఫేస్ బుక్ పేజీలో షహీన్ బాఘ్, గేమ్ ఓవర్, నేనొక్కడినే ఇక్కడ హిందువును వంటి మెసేజ్ లు ఉన్నాయి. యువకుడి తండ్రికి పొగాకు దుకాణం ఉందని పోలీసులు చెప్పారు.