లాక్‌డౌన్ కారణంగా దేశంలో గృహహింస కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. భార్యా,భర్తలిద్దరూ ఇంట్లోనే ఉండటంతో సాధారణ పరిస్ధితుల కంటే ఎక్కువగా ఇద్దరూ గొడవపడుతున్నారు. దీంతో మహిళలు పోలీస్ స్టేషన్‌లకు క్యూకడుతున్నారు. తాజాగా లూడో గేమ్‌లో తనను ఓడించిందనే కోపంతో ఓ భర్త భార్య వెన్నెముకును విరక్కొట్టాడు.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడొదరాకు చెందిన 24 ఏళ్ల మహిళ ఇంట్లో ట్యూషన్లు చెబుతూ భర్తకు అండగా ఉంటోంది. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచించిన నిబంధనలను ఆమె పాటించాలని నిర్ణయించింది.

Also Read:మోడీ రెండు గజాల నినాదం, లాక్ డౌన్ ఎత్తివేతకు కేంద్రం మొగ్గు, ఎగ్జిట్ ఎలాగంటే...

అలాగే తన భర్త ఇతరులతో గడపటానికి బదులు ఇంట్లోనే ఉండాలని కోరుకుంటూ, మొబైల్ ఫోన్‌లో భర్తతో లూడో గేమ్ ఆడుతోంది. ఈ క్రమంలో అతనిని ఆమె వరుసగా నాలుగు సార్లు ఓడించటంతో దానిని తట్టుకోలేకపోయాడు.

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అతను భార్యతో వాగ్వాదానికి దిగడంతో పాటు అసభ్యంగా దూషించాడు. ఇప్పటికే తనకంటే ఎక్కువగా సంపాదిస్తోందని భావిస్తున్న అతని అహం లూడో గేమ్‌తో మరింత దెబ్బతింది. ఆ వెంటనే ఆమెపై తీవ్రంగా దాడి చేయడంతో బాధితురాలి వెన్నెముక విరిగిపోయింది.

Also Read:తాత చనిపోయాడని సమాధి తవ్వుతూ...

దీంతో స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే చేసిన నేరాన్ని అంగీకరించిన అతను భార్యకు క్షమాభిక్ష చెప్పడంతో బాధితురాలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఆమెకు విశ్రాంతి అవసరం ఉన్నందున భార్యను  తల్లిదండ్రుల వద్ద ఉండేందుకు అంగీకరించాడు.