కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడడానికి ప్రపంచం వద్ద ఎటువంటి ఆయుధం లేదు. కేవలం లాక్ డౌన్ లో తల దాచుకుంటూ ఆ వైరస్ నుంచి తప్పించుకుంటోంది. భారతదేశం కూడా ప్రపంచ దేశాలు చూపిన బాటలోనే పయనిస్తూ లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ మూడు వారల లాక్ డౌన్ ముగుస్తుండగానే.... మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు స్వయానా ప్రధానమంత్రే ప్రకటించారు. 

ఇక ఇప్పుడు రెండవ పర్యాయం విధించిన లాక్ డౌన్ కూడా మరో 6 రోజుల్లో ముగియనున్న విషయం అందరికి తెలిసిందే. మే 3వతేదితో ప్రధాని విధించిన లాక్ డౌన్ పూర్తవుతుంది. దీనితో నేటి ఉదయం ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. 

హాట్ స్పాట్స్ లో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు తేల్చి చెప్పినట్టు తెలియవస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ కి హాజరైన వారిలో చాలామంది లాక్ డౌన్ ని ఎత్తివేయాలని కోరినట్టు సమాచారం. 

ఆర్థికంగా భారతదేశ పరిస్థితి సంతృప్తికరంగా ఉందని మోడీ అన్నారు. రెండు గజాల దూరం అనే సిద్ధాంతాన్ని మోడీ ప్రతిపాదించారు.  

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన బదులుగా ప్రత్యేక కార్యదర్శి ఈ మీటింగ్ కి హాజరయ్యారు. మమతా బెనర్జీ కూడా ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ కి హాజరయ్యారు. 

ఆమె రాదూ అని ఊహాగానాలు వినిపించినప్పటికీ.... ఆమె మాత్రం వచ్చి కూర్చున్నారు. ఈ రోజు ఆమెకు మాట్లాడడానికి అవకాశం దొరకలేదు. లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకునేముందైనా పెద్ద రాష్ట్రాలను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఆమె డిమాండ్ చేసారు. 

ఇక ఈ సమావేశంలో నవీన్ పట్నాయక్ ఏకంగా మరో నెల రోజులపాటు లాక్ డౌన్ ను పొడిగించాలని డిమాండ్ చేసారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తూనే... గ్రీన్ జోన్స్ లో నియమాలను మరింతగా సరళీకరించాలని కోరారు. 

ఎప్పటి నుండో కూడా చర్చ జరుగుతున్నటువంటి గ్రీన్ జోన్స్, రెడ్ జోన్స్ ఇప్పుడు అమల్లోకి వచ్చేలా కనబడుతున్నాయి. రెడ్ జోన్లను పూర్తిగా ఐసొలేట్ చేసి లాక్ డౌన్ నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుంది. 

ఇన్ఫెక్షన్ల ఆధారంగా రెడ్, ఆరంజ్ గ్రీన్ జోన్లుగా ప్రాంతాలను విభజించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ప్రైవేట్ వాహనాలను ఆరంజ్, గ్రీన్ జోన్లలో అనుమతించేందుకు కేంద్రం యోచిస్తోంది. ప్రభుత్వ రవాణా మాత్రం ఉండకపోవచ్చని తెలుస్తుంది. 

పాఠశాలలు, కళాశాలలు మాత్రం ఇప్పుడప్పుడు తెరుచుకునేలా కనబడడం లేదు. రెడ్ జోన్లలో ఉన్నవాటిని ముందుగా ఆరంజ్ జోన్లోకి తీసుకురావాలని, ఆ తరువాత గ్రీన్ జోన్లోకి తీసుకొని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. 

ప్రభుత్వం ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి చేయనున్నట్టు తెలుస్తుంది. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు మాత్రం ఇప్పుడప్పుడు మొదలయ్యేలా కనబడడం లేదు.