తాత చనిపోయాడని సమాధి తవ్వుతూ...
ఆయనను ఖననం చేయడానికి మనవడు సలీమ్, కొంతమంది స్నేహితులతో కలిసి శ్మశాన వాటికకు వెళ్లాడు. సమాధి తవ్వడం మొదలు పెట్టారు.
తాత చనిపోయాడని.. పూడ్చి పెట్టడానికి సమాధి తవ్వుతున్నాడు.. తోడుకు స్నేహితులను తీసుకువచ్చి.. వాళ్లని కూడా తవ్వమని అడిగాడు. అలా తవ్వుతూనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తాతా మనవళ్లను పక్క పక్కనే ఖననం చేశారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ముజఫర్ నగర్‌లో నివాసం ఉంటే 80 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. వృద్ధాప్య కారణాలతో వచ్చే రుగ్మతలతో అతను తుదిశ్వాస విడిచాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనను ఖననం చేయడానికి మనవడు సలీమ్, కొంతమంది స్నేహితులతో కలిసి శ్మశాన వాటికకు వెళ్లాడు. సమాధి తవ్వడం మొదలు పెట్టారు.
అయితే అదే సమయంలో సలీమ్‌కు ఛాతిలో నొప్పి మొదలైంది. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. విచిత్రం ఏంటంటే... అతను చనిపోయే ముందు ఆ పక్కనే మరో సమాధి తవ్వమని తన స్నేహితులకు చెప్పాడట. ఆ కొద్దిసేపటికే అతను గుండెపోటుతో చనిపోయాడు. ఇది తలుచుకుని ఆయన స్నేహితులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. తన మరణాన్ని ముందే ఊహించి.. తమతో ఆ మాట చెప్పాడా అని కన్నీరుమున్నీరవుతున్నారు.