ఎయిర్‌పోర్టులో కొండచిలువల కలకలం.. ఏకంగా 47 కొండచిలువల పట్టివేత.. ఎక్కడంటే?
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో మలేషియాకు చెందిన వ్యక్తి వెంట 47 కొండ చిలువలను, రెండు బల్లులను పట్టుకుని దిగాడు. అతని పెట్టె కదులుతున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. అక్రమంగా తీసుకువచ్చిన ఆ జీవులను తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

చెన్నై: వర్షాలు దంచి కొట్టిన సందర్భంలో పలు చోట్ల పాములు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చూశాం. కానీ, తమిళనాడులోని తిరుచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒకేసారి 47 కొండచిలువులను పట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే.. ఇవి వరదల్లో కొట్టుకువచ్చినవి కావు. కావాలనే మలేషియా నుంచి పట్టుకువచ్చినవి. అక్రమంగా వీటిని దేశంలోకి తెచ్చిన ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
మలేషియా రాజధాని కౌలలాంపూర్‌కు చెందిన మహమ్మద్ మెయిదీన్ తిరుచి అంతర్జాతీయ విమనాశ్రయంలో దిగాడు. ఆయన ఒక్కడే దిగలేదు. తనతో పాటు 47 కొండచిలువలను, రెండు బల్లులను అక్రమంగా తీసుకువచ్చాడు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత అతని బ్యాగ్‌లో ఏవో కదులుతున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీలు చేశారు.
ఆ బ్యాగ్‌లో నుంచి పలు జాతులకు చెందిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోల్స్ ఉన్న బాక్స్‌లో ఆ కొండచిలువలను, బల్లులను మెయిదీన్ వెంట తీసుకు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు మెయిదీన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆ మూగ జీవాలను తిరిగి మలేషియా దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు.